‘పుష్ప’ సినిమా మొదలైనపుడు అది ఒక పార్ట్‌గానే రావాల్సిన సినిమా. కానీ తర్వాత రెండు భాగాలైంది. రెండో భాగంతో ఈ కథ ముగిసిపోతుందని అనుకుంటే.. పార్ట్-3 గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా తీస్తారా లేదా అన్నది పక్కన పెడితే.. పుష్ప-3కి లీడ్ ఇవ్వబోతున్నారని మాత్రం టీం నుంచి సమాచారం బయటికి వచ్చింది. కానీ హీరో అల్లు అర్జునేమో ఇటీవల ‘పుష్ప-2’ చివరి రోజు షూట్ సందర్భంగా ‘పుష్ప’ జర్నీ ముగిసిందంటూ ట్వీట్ వేయడంతో మూడో భాగం ఉండదనే చర్చ మొదలైంది. ఇక సుకుమారేమో ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. బన్నీ మూడేళ్లు టైం ఇస్తే పుష్ప-3 చేస్తానని అన్నాడు. ఇలా మూడో భాగం మీద చాలా అయోమయం నడుస్తున్న టైంలో ‘పుష్ప-3’ గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘పుష్ప-3’కి సుకుమార్ పెట్టిన టైటిల్ వెల్లడైపోవడంతో దీని గురించి చర్చలు ఊపందుకున్నాయి.
‘పుష్ప-2’ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ రసూల్ పొకుట్టి.. తన స్టూడియో నుంచి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో తన టెక్నికల్ టీంతో కలిసి నిలబడి ఉండగా.. వెనుక బ్యాంగ్రౌండ్లో ఉన్న స్క్రీన్ మీద ‘పుష్ప-3: ది రాంపేజ్’ అని కనిపిస్తోంది. ఇది ‘పుష్ప-2’ చివర్లో ఇవ్వబోతున్న లీడ్ అని అర్థమైంది. ఐతే సర్ప్రైజ్ లాగా ఉంచాల్సిన విషయాన్ని రసూల్ బయటపెట్టేయడంతో టీంలో కలకలం రేగినట్లుంది. దీంతో కాసేపటికే ఆయన ఈ పోస్టును డెలీట్ చేసేశారు. కానీ ఈ లోపు విషయం వైరల్ అయిపోయింది.
‘రాంపేజ్’ అని టైటిల్లో పెట్టారంటే మూడో పార్ట్‌లో విధ్వంసం పతాక స్థాయికి చేరుతుందని.. కాబట్టి కచ్చితంగా సుకుమార్-బన్నీ ఈ సినిమా కూడా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సుకుమార్, బన్నీలకు ఉన్న వేరే కమిట్మెంట్ల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ఈ సినిమా ఉంటుందా.. మొత్తంగా మూడో భాగం చేస్తారా లేదా అన్నది చూడాలి.