ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని… “ది ప్రింట్” సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారిక అప్పుల ఆధారంగా ఆ జాబితాలో ఆంధ్ర నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే మనదే మొదటి స్థానం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పడే మేల్కోకపోతే ఏపీకి శ్రీలంక గతి తప్పదని హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో దేశంలో కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారిన వైనమూ ప్రధాన ఎజెండా అంశంగా చర్చించారని ఆ కథనంలో ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకోకుండా ఇదే రీతిలో ఉచిత పథకాలు అమలు చేస్తే శ్రీలంక పరిస్థితులు ఏర్పడే అవకాశమూ ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారంటూ ప్రింట్ కథనం ఉదహరించింది.
‘శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పంజాబ్, బిహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు ఎందు కు మేల్కోవాలి? ఉచిత పథకాలు, అప్పులకు ఎందుకు కోత పెట్టాలి?’ అనే శీర్షికన ఈ కథనం ప్రచురిం చింది. ఈ 5 రాష్ట్రాల్లోని ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ సాగిన ది ప్రింట్ కథనం సంచలనంగా మారింది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక లెక్కలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ లెక్కలను చూసే మన ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతక న్నా దారుణంగా ఉంది. అప్పులు అంతకుమించి ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
శ్రీలంక పరిస్థితి ఇదీ..
చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు పెట్రోలు, వంట గ్యాస్, నిత్యావసరాల కోసం నరకం చవి చూస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటాయి. సుదీర్ఘ విద్యుత్తు కోతలతో దేశమంతా అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్వలు పడిపోవడంతో 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించే పరిస్థితి లేదని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు తమ అప్పులను తగ్గించుకోకపోతే రాబోయే కొన్నేళ్లలో శ్రీలంకలోని పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అప్పులపై కఠిన ఆంక్షలు విధిస్తే వారు తమ ప్రస్తుత రుణాలను కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయి అంటూ ‘ది ప్రింట్’ కథనం వెలువరించింది.