టాలీవుడ్ స్టార్ హీరోల్లో మంచి రివ్యూయర్‌గా పేరున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు కే. తెలుగులో వచ్చే చిన్న సినిమాల నుంచి ప్రపంచ స్థాయిలో వచ్చే భారీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల వరకు మహేష్ బాబు తనకు ఆసక్తి రేకెత్తించే కంటెంట్ చూసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు. కొన్నిసార్లు తన సన్నిహితులు, తెలిసిన వాళ్ల కోసం సినిమాలు చేసి వాటి మీద రివ్యూ ఇస్తుంటాడు. మహేష్ ఇలా పోస్టు పెడితే అది ప్రమోషన్‌కు చాలా ఉపయోగపడుతుందని భావిస్తుంటారు వాటి మేకర్స్ భావిస్తుంటారు.
ఐతే మహేష్ బాబు రివ్యూల గురించి టాలీవుడ్ జనాలు చెప్పడంలో విశేషం ఏమీ లేదు. కానీ ఒక తమిళ దర్శకుడు సూపర్ స్టార్ రివ్యూలకున్న పవరేంటో చెప్పడం విశేషం. ఆ దర్శకుడే.. అశ్విన్ మారిముత్తు. ఓ మై కడవులే చిత్రంతో వెలుగులోకి వచ్చిన అశ్వత్.. అదే చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశాడు. లేటెస్ట్గా అతను తీసిన డ్రాగన్ మూవీని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్ అయింది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో అశ్వత్ మాట్లాడుతూ.. మహేష్ బాబు రివ్యూల గురించి ప్రస్తావించాడు. ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ బాబు పాజిటివ్‌గా రివ్యూ పోస్ట్ చేశాడని.. అది చూసి ఎంతోమంది తెలుగు వాళ్లు తన సినిమా చూశారని తెలిపాడు అశ్వత్. అలాగే ఇప్పుడు డ్రాగన్ మూవీ గురించి కూడా ఎవరైనా మహేష్ బాబుకు చెబితే బాగుంటుందని.. ఆయన సినిమా చూసి సర్టిఫై చేస్తే తాము ఎంతో సంతోషిస్తామని అశ్వత్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక ఈ ఈవెంట్లో హీరో ప్రదీప్ రంగనాథన్, డ్రాగన్‌ను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్ కలిసి ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో ఫేక్ ఇంటర్వ్యూలో పాల్గొనే హీరో పక్కనున్న వ్యక్తి మాటలకు తగ్గట్లు లిప్ సింక్ ఇస్తుంటాడు. దాన్ని రీక్రియేట్ చేస్తూ ప్రదీప్ లిప్ సింక్ ఇస్తుంటే.. రవిశంకర్ సక్సెస్ మీట్ స్పీచ్ ఇవ్వడంతో ఆడిటోరియం హోరెత్తింది.