సంక్రాంతి సందడి తర్వాత మధ్యలో కొంచెం డల్ అయిన బాక్సాఫీస్‌కు ఇప్పుడు మళ్లీ కళ వచ్చింది. ఈ శుక్రవారం రిలీజైన ‘తండేల్’ సినిమా థియేటర్లను కళకళలాడిస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు మరీ గొప్ప టాకేమీ రాలేదు. టీం చెప్పినంత గొప్పగా లేదు కానీ.. వాచబుల్ మూవీ అనే టాక్ వచ్చింది.
ఆ టాక్‌తోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది తొలి రోజు రూ.20 కోట్ల గ్రాస్, రూ.12 కోట్ల షేర్‌తో నాగచైతన్య కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐతే టాక్ మరీ గొప్పగా లేని నేపథ్యంలో రెండో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ తొలి రోజును మించి రెండో రోజు ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.
బుక్ మై షోలో డే-1 కంటే డే-2నే ఎక్కువ టికెట్లు తెగాయి ‘తండేల్’కు. శనివారం 2.6 లక్షల టికెట్లకు పైగా సేల్ అయ్యాయి. వసూళ్లు సైతం తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల గ్రాస్ రూ.42 కోట్లకు చేరువైంది. అంటే శుక్రవారం కంటే శనివారం వసూళ్లు పెరిగాయన్నమాట. మామూలుగా చాలా సినిమాలకు తొలి రోజు ఎంత భారీ వసూళ్లు వచ్చినా.. రెండో రోజు డ్రాప్ ఉంటుంది.
ఇలా డే-2 వసూళ్లు పెరగడం అరుదు. దీన్ని బట్టి సినిమా జనాలను థియేటర్ల వైపు బాగా ఆకర్షిస్తోందని.. ప్రేక్షకుల ఆమోదం పొందిందని అర్థం. మూడో రోజు, ఆదివారం వసూళ్లు ఇంకా పెరిగితే ఆశ్చర్యం లేదు. ఐతే సోమవారం నుంచి సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నది ఆసక్తికరం. మూడు రోజుల్లో రూ.50 కోట్ల మార్కును దాటడం లాంఛనమే. మరి టీం చెప్పిన వంద కోట్ల మైలురాయిని కూడా ‘తండేల్’ అందుకుంటుందేమో చూడాలి. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది.