చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారటమే కాదు…ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిర్మల్ జిల్లా భైంసాలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు తీవ్ర ఘర్షణలకు దారి తీయటమే కాదు.. అనూహ్య పరిణామాలకు దారి తీశాయి. ఆదివారం రాత్రి జుల్ఫికర్ కాలనీలో జరిగిన చిన్నవివాదం.. పెద్దదిగా మారటమే కాదు పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. చెలరేగిపోయిన అల్లరిమూకలు.. వీధుల్లో కత్తులతో స్వైర విహారం చేశారు. పది మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ముగ్గురు విలేకరులు.. మరో ముగ్గురు పోలీసులు ఉన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అసలీ వివాదానికి కారణం ఏమిటన్నది చూస్తే..ఆదివారం రాత్రి 7.30 గంటల వేళ.. భైంసాలోని జుల్ఫికర్ కాలనీలో కొంత మంది యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ కాలనీలో తిరిగారు. దీంతో స్థానికులు నిలదీశారు. రైతులు.. పొలం పనులకు వెళ్లిన వారు నిద్రపోయే సమయంలో.. పెద్ద శబ్దం చేస్తూ తిరగొద్దన్నారు. ఈ క్రమంలో మొదలైన వివాదం నిమిషాల్లో పెరిగి పెద్దది కావటమే కాదు.. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. క్షణాల్లో బట్టీగల్లీ.. పంజేషా.. చౌక్.. కోర్బగల్లీ.. బస్టాండ్ ఏరియాతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.ఒక వర్గం యువకులు.. ప్రత్యర్థి వర్గం వారికి చెందిన రెండో ఆటో రిక్షాలు.. ఒక కారు.. రెండు ద్విచక్రవాహనాలను తగలబెట్టారు.
ఇళ్లపైకి రాళ్లు విసిరారు. కత్తులతో కాలనీల్లో స్వైర విహారం చేయటమే కాదు.. పలువురిని గాయపర్చారు. ఇళ్లను తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఒక కూరగాయల దుకాణాన్ని తగులబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కత్తులతో దాడి చేశారు.ఈ దాడిలో ఈనాడు.. ఆంధ్రజ్యోతితో పాటు మరో విలేకరికి గాయాలు అయ్యాయి. వీరిలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తో పాటు.. మరో రిపోర్టర్ కు తీవ్ర గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. అల్లరిమూకల రాళ్లదాడిలో ఒక పోలీసు అధికారి.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఘర్షణలో మరో నలుగురు యువకులు గాయపడ్డారు.
క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి పది గంటల నాటికి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.పరిస్థితి అదుపు తప్పటంతో భైంసాలో అదనపు బలగాల్ని మోహరించారు. ఆయా ప్రాంతాల్లో అల్లరిమూకల్ని చెదరగొడుతూ పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు భైంసాకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గతంలోనూ భైంసాలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈసారి చోటు చేసుకున్న పరిణామాలపై షాకింగ్ గా మారటమే కాదు.. భైంసా అల్లర్లకు చెక్ పెట్టే అవకాశం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.