అనుకున్న రోజు రానే వచ్చింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజునే విడుదల కానున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత వారాల తరబడి ఫలితాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వారందరికి మరికొద్ది గంటల్లో ఫలితాలపై క్లారిటీ రానుంది. దేశం మొత్తం ఒకలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందంటున్నారు.
చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భిన్నమైన రాజకీయ వాతావరణం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఒకవైపు.. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా మరోవైపు నిలిచి ఎన్నికల గోదాలోకి దిగటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్ని ఓటర్లలో అత్యధికం వ్యక్తిగతంగా తీసుకోవటం ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు.. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లిన ప్రత్యేక పరిస్థితి ఏపీలో నెలకొంది.
ఈ వాదనకు తగ్గట్లే.. ఏపీలో పోలింగ్ తర్వాతి రోజు హింస షాక్ కు గురి చేసింది.
యావత్ దేశం మొత్తం ఏపీ వైపు చూసిన పరిస్థితి. అక్కడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓట్ల లెక్కింపు వేళ.. ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవటంతో పాటు అదనపు బలగాల్ని పెద్ద ఎత్తున మొహరించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపైనా.. విమర్శల పైనా వాయు వేగంతో స్పందిస్తూ చర్యల్ని చేపట్టారు. ప్రస్తుతం ఏపీ మొత్తం నివురు గప్పిన నిప్పులా ఉంది.
ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ప్రత్యర్థుల విషయంలో విజయం సాధించిన పార్టీ నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరుల తీరు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠతో పాటు.. ఓట్ల లెక్కింపు.. గెలుపు లెక్కలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? హింసాత్మక ఘటనలు ఏమేరకు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. దీంతో.. ఎన్నికల ఫలితాల మీద ఎంత టెన్షన్ ఉందో.. హింసాత్మక చర్యల మీద కూడా అంతే ఆందోళన నెలకొని ఉన్నట్లుగా చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడు చూడలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.