దేశ రాజకీయాలను గమనిస్తే.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన నాయకులు.. ప్రజల బాగు కోసం పనిచేసిన నాయకులు మనకు కనిపిస్తారు. వారు తీసుకునే నిర్ణయాలు .. చిన్నవా పెద్దవా? అనే తేడా లేకుండా.. విశాల దేశ హితమే లక్ష్యంగా.. ప్రజల ప్రయోజ నమే గీటురాయిగా.. ముందుకుసాగారు.
ఒకవేళ.. ఎక్కడైనా.. ఏదైనా తేడా కొడుతుందని.. భావిస్తే.. ఎలాంటి అహంకార ధోరణు లకు పోకుండా.. అన్ని పక్షాలతో మాట్లాడి చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ.. గత కొన్నేళ్లుగా.. దేశంలోనూ .. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులను ఆందోళనకు గురిచేస్తుండగా.. ప్రజలను తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. అదేసమయంలో అత్యంత విలువైన ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోంది.
నేతలు వ్యవహరించే తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యూటర్న్ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీని తీసుకుంటే.. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు వ్యతిరేకించారు.
ఇది సర్వసాధారణం. ప్రబుత్వాలు చేసినవి అన్నింటినీ.. ప్రజలు స్వాగతించాలని ఏమీ ఉండదు కదా! అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది.. అసలుతాను తీసుకుంటున్న నిర్ణయంపై.. ప్రజాప్రతినిధులుగా ఉన్న, ప్రజల సమస్యలపై చర్చించాల్సిన చట్టసభల్లో వాటికి చోటు కల్పించారా? అనేదే! ఎందుకంటే.. అటు లోక్‌సభలోకానీ, ఇటు రాజ్యసభలో కానీ.. ఎక్కడా సాగు చట్టాలపై చర్చజరిగింది లేదు.
లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి.. ధిక్కారమున్సైతువా! అంటూ.. కాంగ్రెస్‌పై పైచేయి సాధించే క్రమంలో మూకుమ్మడిగా ఈ బిల్లులను ఆమోదించుకున్నారు. రాజ్యసభకు వచ్చేసరికి.. కనీసం.. దీనిపై ఒక కమిటీని వేసి చర్చించాలని.. కొన్ని క్లాజులను తొలగించాలని సూచించిన సభ్యుల మాటలకు విలువ లేకుండా పోయింది.
ఫలితంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైర్మన్(ఉపరాష్ట్రపతి) కన్నీరు పెట్టుకున్నారు. అంతిమంగా.. ఇది చట్టంగా రూపొందినా.. ప్రజావ్యతిరేకత ముందు తేలిపోయింది. దీంతో విశాల జనహితం.. అన్నదాతల అభ్యున్నతి అంటూ దంచికొట్టిన ప్రధానే.. ఆ చట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక, తెలంగాణ పరిస్థితిని చూసుకుంటే.. మన పాలన మనం చేసుకుంటూ.. మనపై మనమే ధర్నాలు చేస్తమా! అంటూ.. ధర్నాలు.. నిరసనలు ఇక జాన్తానై!! అని ప్రకటించి ఇందిరా పార్కు వద్ద ధర్నాలకు అవకాశం లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించారు.
అయితే.. దీనిపై ప్రజాసంఘాలు.. ఉద్యమ నాయకులు.. కోర్టును ఆశ్రయించడంతో కేసీఆర్ తోకముడిచారు. ఇక, ఇటీవల వరి విషయంలో ఆయనే స్వయంగా.. ఇందిరా పార్కును వేదికగా చేసుకుని కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఇక్కడ కూడా ఒంటత్తు పోకడలే తప్ప.. విశాల జనహితం.. మచ్చుకు కూడా కనిపించలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఫలితంగా యూటర్న్ తీసుకున్నారు.
ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రతిదీ రివర్సే! పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం నుంచి మూడు రాజధానుల వరకు ముందు దూకుడు.. తర్వాత.. వెనుకడుగు అన్నచందంగానే పాలకుల ప్రవర్తన ముడిపడిపోయింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన శాసన మండలి విషయంలో టీడీపీపై ఉన్న అక్కసుతో రద్దు తీర్మానం చేసేయడం.. రాత్రికి రాత్రి మండలిని మడిచేయాలని.. మట్టుబెట్టాలని.. ప్రయత్నించడం.. దేశం నివ్వెర పోయేలా చేసింది.
లేనివారు.. లేవని ఏడుస్తుంటే.. ఉన్నదాన్ని.. తన తండ్రే తెచ్చిన దాన్ని ఇక్కడి సీఎం.. పక్కన పెట్టాలని ప్రయత్నించారు. ఇటీవల తనకు లాభం జరుగుతోందని .. తెలిసి మళ్లీ యూటర్న్ తీసుకుని.. మామండలి మాక్కావాలంటూ.. తీర్మానం చేశారు.
మూడు రాజధానులదీ అదే పరిస్థితి. లోపాలు ఉన్నాయని.. అందరూ గగ్గోలు పెట్టినా.. మీరంతా.. రాష్ట్ర ద్రోహులు.. మా పాలనను , మేం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ఇలా చేస్తున్నారంటూ.. ఎదురు దాడి చేయించిన ప్రభుత్వం.. తుదకు మిన్నువిరిగి మీదపడుతున్న క్రమంలో.. వెనక్కి తీసుకుంది. మళ్లీ కొత్తగా వస్తామని పేర్కొంది. ఇలా.. ఒకటి కాదు.. అనేక అంశాల్లో ఏపీ సర్కారు బోనులో చిక్కుకుంటోంది.
మరి వీటిని పరిశీలిస్తున్నవారు.. దేశ నేతలుగా చలా మణి అవుతున్న.. అవుతామని చెబుతున్నవారు ఎవరికి ఆదర్శం.. ఎలా ఆదర్శం.. ఎందుకు ఆదర్శం.. అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా.. పదిమందితో చర్చించే తీరిక లేకుండా.. వ్యవహరిస్తున్న పాలకులు.. ఆదర్శ నేతలేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.