పద్దతిగా మాత్రమే మాట్లాడే మాటలతో కూడిన ఇంటర్వ్యూలకు కాలం చెల్లిపోయింది. కడుపులోని వేదనను దాచుకొని పెదాల మీద చిరునవ్వులు చెదిరిపోకుండా వ్యవహరించే తీరుకు ఫుల్ స్టాప్ పడింది. తాము ఎదుర్కొన్న జీవితాన్ని.. తాము ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల్ని విప్పి చెప్పే రోజులు వచ్చేశాయి. హీరో.. హీరోయిన్ అన్న తేడా లేకుండా తమ కెరీర్ లో తమకు ఎదురైన అనుభవాల్ని చెప్పేసే ట్రెండ్ కొద్దికాలంగా నడుస్తోంది. తెలుగు వారి బాపు బొమ్మగా అందరి మనుసుల్లో ముద్ర పడిన సీనియర్ నటి ఆమని.
తన అందం.. అభినయంతో మిగిలిన గ్లామర్ హీరోయిన్లకు భిన్నమైన క్రేజ్ ఆమె సొంతం. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాల్ని పంచుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. పలువురు దర్శకులు తనను మాత్రమే రావాలని.. వెంట అమ్మను తీసుకురావొద్దని చెప్పిన వైనాన్ని చెప్పి.. తాను అలాంటి వాటికి నో చెప్పటంతో తనకు తొలి సినిమా ఛాన్స్ రావటానికి నాలుగేళ్లకు పైనే పట్టినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత పలు హిట్ మూవీలు చేసిన ఆమె సంగతి తెలిసిందే. కాస్తంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
ఇలాంటి వేళ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విశేషాల్ని బయటపెట్టారు. తన తొలి సినిమా స్వర్గీయ ఇవీవీ దర్శకత్వం వహించిన జంబలకడి పంబ సినిమా షూటింగ్ అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. తాను మందుకొట్టే సీన్ ఒకటి చేయాల్సి వచ్చిందన్నారు. అయితే.. దర్శకుడు ఈ సీన్ గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. షూటింగ్ స్పాట్ వెళ్లిన తర్వాత సీన్ చెబితే.. చేతికి కూల్ డ్రింక్ ఏదో ఇస్తారని తాను అనుకున్నట్లు చెప్పారు.
తీరా చూస్తే.. నిజం బీర్ గ్లాస్ ను చేతికి ఇచ్చి తాగాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ‘‘బీర్ గ్లాస్ చేతికి ఇచ్చి జస్ట్ ఒక సిప్ వేయమన్నారు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు హీరో నరేశ్ కూడా ఏం ఫర్లేదు.. తాగమ్మా అని చెప్పారు. అలా మొదటి సినిమాలోనే మందు తాగే సీన్ నను రియల్ గా చేసేశా’’ అంటూ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.