ప్రపంచంలో దేనితోనైనా పోటీ పడొచ్చు కానీ మృత్యువుతో పోటీ పడలేం. అది ఒకసారి డిసైడ్ అయ్యాక దాని బారి నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు. లక్కీగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడదు. వేరే సమయంలో..వేరొక రూపంలో మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది…హాలీవుడ్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ సినిమా థీమ్ ఇది. సరిగ్గా ఈ రీల్ లైఫ్ లో చూపించినట్లుగానే రియల్ లైఫ్ లో కూడా ఓ ఎన్నారై మరణించిన వైనం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడు అచ్చు ఆ సినిమాలో మాదిరి అమెరికాలో మృత్యువాత పడ్డారు. రీల్ లైఫ్ మాదిరి రియల్ లైఫ్ లో జరిగిన ఈ విషాదం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన అబ్బరాజు వెంకటరమణ విద్యుత్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. రెండేళ్ల క్రితం ఆయన మరణించారు. ఆయన కుమారుడు అబ్బరాజు ప్రథ్వీరాజ్ (30). అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. నార్త్ కరోలినాలో నివసించే అతను గత ఏడాది శ్రీప్రియను పెళ్లాడారు. అతడి తల్లి హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని అలకాపురిలో ఉంటున్నారు.
తాజాగా భార్యతో కలిసి కారులో వెళుతున్న అతని వాహనానని మరో కారు వేగంగా ఢీ కొంది. దీంతో వీరి కారు పల్టీలు కొట్టింది. లక్కీగా కారులోని బెలూన్లు తెరుచుకోవటంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద షాక్ లో ఉన్న భార్యను కారులో ఉంచి.. పోలీసులకు సమాచారం అందించేందుకు కారు దిగాడు. రోడ్డు మీద నిలుచొని పోలీసులతో ఫోన్ మాట్లాడుతుండగా.. వేగంగా వచ్చిన మరో కారు అతన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో.. ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్న కాసేపటికే మరో ప్రమాదంలో మరణించిన వైనం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచెత్తింది. ఆదివారం అమెరికా నుంచి డెడ్ బాడీని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.