వైసీపీకి ఓటు వేసి 25 మంది ఎంపీలను లోక్ సభకు పంపితే కేంద్రం మెడలు వంచి ఏపీ కి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్..ఆ తర్వాత తనతోపాటు తన పార్టీ నేతలకు సంబంధించిన కేసుల మాఫీ కోసం మోడీ దగ్గర మెడ, తల వంచి నిలబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కన్నేసిన కేంద్రం దానిని ప్రైవేట్ పరం చేస్తున్నా…జగన్ కిక్కురుమనడం లేదు.
ఇక, ఆ ప్రైవేటీకరణ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కైవసం చేసుకునేందుకు తెలంగాణ సర్కార్ బిడ్ వేసే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది. ఇదే జరిగితే…ఆరు కోట్ల ఆంధ్రులకు ఘోర అవమానం తప్పదని టాక్ వస్తోంది. బిడ్డింగ్ ప్రక్రియపై అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదనేదే తమ ప్రభుత్వ నిర్ణయం అని చిలకపలుకులు పలికారు. తమ స్టాండ్ అదే అని, అటువంటి సమయంలో ప్లాంట్ ను తాము ఎలా కొంటామని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గతంలో కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ అంశం గురించి కేసీఆర్ నుంచి కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వినలేదని చెప్పారు. వాళ్ల స్టాండ్ తెలిశాక స్పందిస్తానని అన్నారు.
ప్రైవేటీకణకు వ్యతిరేకం అంటోన్న ఏపీ సర్కార్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు…అలా అని కొనే ప్రయత్నం చేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ బిడ్ వేసి ప్లాంట్ కొన్నా సరే తాము దానికి వ్యతిరేకం అని చేతులు దులుపుకుంటారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు.