మన తెలుగు వారికి సంక్రాంతి అనేది ఎంతో ప్రత్యేకమైన పండుగ. భోగి మంటలు, కోడి పందాలు, హరికథలు, గంగిరెద్దుల ఆటలు, పిండి వంటలు, ముగ్గులు ఇలా పల్లెటూర్లలో సంక్రాంతి హడావుడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే పట్టణాల్లో ఉన్న వారంతా సంక్రాంతి పండుగను తమ సొంతూరులో ఆనందంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. ఇక సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిందంటే నగరాల్లోని పలు ప్రాంతాలు, కాలనీలు నిర్మానుష్యంగా మారుతుంటాయి. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ఇతరత్రా వ్యవహారాలతో పట్టణాల్లో ఉన్నవారంతూ పండక్కి ఊరెళ్తుంటారు.
అయితే సంక్రాంతి పండుగ రాబోతుండటంతో ఊరెళ్తున్నవారికి తెలంగాణ పోలీస్ జరభద్రం బాస్ అంటూ అలర్ట్ మెసేజ్ ను జారీ చేసింది. ప్రజలు ఊరి బాట పట్టడంతో దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి మొత్తం ఊడ్చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఊరెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని.. సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని.. నగలు, నగదు ఇంట్లో పెట్టవద్దని కీలక సూచనలు చేశారు.
అలాగే ఇంటి తాళాలు పూల కుండీలు, షూ రాక్స్, డోర్ మాట్స్ కింద పెట్టకండి. ఇంటి తాళాలు విలువైన, వస్తువులు మీ వెంటే తీసుకెళ్లండి. వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయండి. పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పండి. ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోండి. సీసీ కెమెరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. డివిఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోండి. ఊరెళుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. కొత్త వ్యక్తులు కదలికపై 100కు డయల్ చేసి సమాచారాన్ని ఇవ్వండి. పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలు నియంత్రించడం సులభం అని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.