తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చాలాకాలంగా ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటున్నప్పటికీ స్పందన రాలేదని, విధిలేక సమ్మెకు దిగామని జూడాలు చెబుతున్నారు. మరోవైపు, కరోనా వేళ జూడాలు సమ్మెకు దిగడంపై ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం కావడంతో తాజాగా జూడాలు సమ్మె విరమించారు.
జూడాల వేతనం 15 శాతంవరకు ప్రభుత్వం పెంచింది. పెరిగిన స్టయిఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించనుంది. దీంతోపాటు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం కూడా 80,500 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరలేదని, కానీ, సీఎం సానుకూల స్పందనతో పాటు ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నామని జూడాలు తెలిపారు.
అంతుకుముందు, స్టయిఫండ్ పెంపును అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణవ్యాప్తంగా జూడాలు సమ్మెకు దిగడం కలకలం రేపింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అత్యవసర, ఐసీయూ సేవలు మినహా మిగతా సేవలకు తాము దూరంగా ఉంటామని జూడాలు ప్రకటించారు. మే 28 నాటికి ప్రభుత్వం స్పందించాలని డెడ్ లైన్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో జూడాల ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు.