ఇప్పటి వరకు కరోనా విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం లేదని.. కరోనా టెస్టులు కూడా సరిగా చేయడం లేదని.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదని కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన తెలంగాణ హైకోర్టు … తాజాగా ఇప్పుడు ఏపీ సర్కారుపైనా విరుచుకుపడింది.
“మేం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు.. మేమంటే లెక్కలేదా? “ అంటూ.. అటు కేసీఆర్ సర్కారు, ఇటు జగన్ ప్రభుత్వాలపై విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెగ పుట్టించాయి.
విషయంలోకి వెళ్తే.. రాష్ట్ర విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతూ.. దాఖలైన వ్యాజ్యంపై 2017లోనే తెలంగాణ హైకోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్రాల హోం శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
ఏడాదిలోగా రాష్ట్ర భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. అయితే.. ఇది జరిగి మూడేళ్లు దాటిపోయినా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. దీంతో ఈ విషయంపై సుమోటోగా(తనంతట తనే) విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటులో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.. నాలుగు వారాల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.
ఈ తాజా ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైతే హోం శాఖ ముఖ్యకార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని తెలిపింది. ఇరు రాష్ట్రాల హోంశాఖ ముఖ్యకార్యదర్శులను విచారణకు పిలవక తప్పదన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది.
భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటుకు 2017లోనే న్యాయస్థానం ఆదేశించినా ఆ తీర్పు అమలు కాలేదు. దీంతో సుమోటోగా కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నమోదు చేసింది. దీంతో ఇప్పుడు అటు కేసీఆర్, ఇటు జగన్ కూడా కోర్టు ఆగ్రహానికి గురయ్యారన్నమాట.