ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో 14 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ గతంలో వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పై బయట ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాజాగా రఘురామ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, జగన్ బెయిల్ రద్దు చేసేందుకు సరైన కారణాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. బెయిల్ షరతులు, నిబంధనలను జగన్ ఉల్లంఘించారు అనేందుకు ఆధారాలు కానీ, ఆ తరహా ఘటనలు కానీ లేవని పేర్కొంది. అందుకే జగన్ బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పునిచ్చారు.
ఇక, జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని, సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించిన సరైన వివరాలను వెల్లడించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సన్నిహితులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా సాక్షాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం సరైన కారణాలు కావని హైకోర్టు అభిప్రాయనడింది.
అందుకే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గత ఏడాది సిబిఐ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఆ తీర్పునాటికి, నేటికి పరిస్థితులలో ఎటువంటి మార్పులు రాలేదని న్యాయమూర్తి అన్నారు. అందుకే, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పునిచ్చారు. ఇక, తాజా తీర్పుతో రఘురామకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లైంది.