ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో సీబీఐకు నోటీసులు ఇచ్చింది. దీనికి కారణం.. సీనియర్ నేత హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యమే కారణం. జగన్ మీద నమోదైన సీబీఐ.. ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోపు తేల్చాలని.. అందుకు తగ్గట్లు ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ కోరారు.
ప్రస్తుతం కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఉన్న జగన్ ఎమ్మెల్యేగా ఎన్నికై.. ముఖ్యమంత్రి కూడాఅయ్యారన్నారు. హరి రామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం నవంబరు 8న జగన్ కు.. సీబీఐకు నోటీసులు జారీ చేసింది. వారికి పంపిన నోటీసులు అందకపోవటంతో.. తమకు అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా అందజేస్తామన్న పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నపానికి కోర్టు నో చెప్పింది. మరోసారి నోటీసులు జారీ చేస్తామని.. వ్యక్తిగత నోటీసులు అవసరం లేదంది.
సుప్రీం ఆదేశాల నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన మూడు నెలల తర్వాత విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు.. జగన్ మీద ఉన్న కేసులు.. సీబీఐ.. ఈడీలునమోదు చేసిన కేసులకు సంబంధించిన విచారణ ఏ దశలో ఉందన్న విషయాన్ని చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదితో పాటు ఆయా సంస్థలు తెలియజేయాలని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కోరారు.
అంతేకాదు.. జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్..కార్మెల్ ఏషియా లిమిటెడ్ ల వాల్యూ నివేదికల కాపీలను అందజేయాలని జగన్ తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేశారు.