కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. రాత్రి పదకొండు తర్వాత పదహారేళ్ల లోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించటంపై నిషేధాన్ని విధించాలని.. ఈ విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొనటం తెలిసిందే. దీనికి సంబందించిన బ్యాన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో.. మల్టీఫ్లెక్సులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ బ్యాన్ ఎత్తేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. మల్టీఫ్లెక్సు.. థియేటర్లకు భారీ ఊరటగా మారుతుందని చెప్పక తప్పదు. ఇంతకూ ఈ ఇష్యూ ఎలా మొదలైందన్నది చూస్తే..పుష్ప 2 బెనిఫిట్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన తొక్కిసలాట.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పట్లో ఈ బ్యాన్ తెర మీదకు వచ్చింది.
అయితే.. ఈ నిర్ణయం కారణంగా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంటూ మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పీవీఆర్ -ఐనాక్స్ సంస్థ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై పిటిషన్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వివాదం మొదలైంది బెనిఫిట్ షోలు. టికెట్ల ధరల పెంపుపైన కానీ.. పిల్లల ప్రవేశం మీద కాదని.. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలపటం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిల్లల ప్రవేవంపై అన్ని వర్గాల నుంచి సూచనలు అందాయని.. వీటిపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఈ అంశంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అదే సమయంలో 16 ఏళ్ల లోపు పిల్లల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో.. ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పాలి.