తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక కాక రేపిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఆ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ చేపట్టారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, కేసీఆర్ కు దళితులపై ప్రేముంటే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదంతా కేసీఆర్ ఎన్నికల స్టంట్ అని, ఎన్నికలు పూర్తయ్యాక స్వయంగా కేసీఆర్ తెర వెనుక ఉండి కేసులు వేయించి మరీ ఆ పథకం ఆపిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, తానేమీ హిమాలయాల్లో నివసించే సాధువును కాదని, తానో రాజకీయవేత్తనని, రాజకీయ ప్రయోజనాల కోసమే హుజురాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు చేపట్టానని కేసీఆర్ బాజాబ్తా చెప్పడం సంచలనం రేపింది. దీంతో, దళిత బంధు పథకం అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని, కేసీఆర్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఉఫ ఎన్నిక నేపథ్యంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీఎం కేసీఆర్ ను ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు.
ఈ క్రమంలోనే ఈ పిటిషన్ హైకోర్టు నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ తోసిపుచ్చారు. లిస్ట్ ప్రకారమే ఆ పిటిషన్ విచారణ జరుపుతామని జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. మరి, ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టిన అనంతరం పథకాన్ని నిలిపివేస్తుందా లేదంటే కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.