కొత్త సంవత్సరం రాబోతుందంటే హైదరాబాద్ లో ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే న్యూ ఇయర్ పార్టీ ప్రిపరేషన్స్ లో యువత బిజీ అయిపోయింది. న్యూ ఇయర్ పార్టీ అంటే మందు, చిందు ఉండాల్సిందే. ముఖ్యంగా మద్యం ప్రియులు ఏడాదిలో ఆఖరి రోజును ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంత తాగుతారో.. ఏం తాగుతారో కూడా తెలియనంత మైకంలో ఊగితుంటారు. అయితే అలాంటి సమయంలో జాగ్రత్తగా లేకుంటే ఆనందాన్ని మోసుకొచ్చే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొన్ని ప్రమాదాలు వెంటబెట్టుకొస్తుంది.
మద్యం మత్తులో వాహనాలు నడపటం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికే అవకాశాలు కూడా ఎక్కువే. ప్రమాదాలను అరికట్టేందుకు, న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఎటువంటి అపశృతి జరగకుండా నివారించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31 రాత్రి పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది.
అయితే ఈ గుడ్ న్యూస్ హైదరాబాద్ సిటీలోని మద్యం ప్రియులకు మాత్రమే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ ఫ్రీ జర్నీ సర్వీస్ ఉంటుందని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఎటువంటి ఛార్జీలు లేకుండా మద్యం తాగిన వ్యక్తులను సేఫ్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు 500 కార్లు, 250 బైక్ టాక్సీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలనుకుంటే 9177624678 నెంబర్ను కాంటాక్ట్ అవ్వాలి. మీ ఫికప్, డ్రాప్ లోకేషన్ వివరాలు చెబితే.. మీ పేరుపై క్యాబ్ బుక్ చేసి వాహనాన్ని పంపిస్తారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారకులు, బాధితులు అవ్వొద్దని ఈ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కోరింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.