‘‘ఎవరు ఎన్నైనా చెప్పండి.. పాత పద్దతికి వెళ్లేదే లేదు. కొత్త పద్దతికి రావాల్సిందే. మార్పు ఎప్పుడో ఒకసారి తప్పదు కదా. కొత్తగా వచ్చినప్పుడు సమస్యలు మామూలే. వారం.. పది రోజుల్లో అన్నింటిని పరిష్కరిస్తాం’’ అంటూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మాట్లాడిన ప్రభుత్వం.. ఎట్టకేలకు దిగి వచ్చింది. కొత్త పద్దతి వద్దు.. పాత పద్దతే ముద్దు అన్న మెజార్టీ వర్గాల మాటకు తలొగ్గింది. ఇంతకాలం మొండితనంతో విలువైన వందకు పైగా రోజుల్ని చేజార్చుకున్న తెలంగాణ సర్కారు.. తాను చేసిన తప్పుల్ని ఎట్టకేలకు తెలుసుకుంది. రిజిస్ట్రేషన్లను పాత పద్దతిలోనే చేపట్టాలని డిసైడ్ చేసింది.
అన్ని అనుకున్నట్లు జరిగితే సోమవారం నుంచి పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయటానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని కోరింది. శనివారం పలువురు కీలక అధికారులతో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త విధానంలో తలెత్తుతున్న సమస్యలతో పాటు.. వాటిని పరిష్కరించే విషయంలో ఉన్న లోటుపాట్లతో పాటు.. వాటిని అధిగమించటానికి ఎంత కాలం పడుతుందన్న విషయంలో వచ్చిన సమాధానం.. కీలక నిర్ణయాన్ని తీసుకోవటానికి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని బ్యాంకులు అంగీకరించే అవకాశం లేకపోవటం.. దేశంలో మరెక్కడా లేని రీతిలో తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల పద్దతి సాంకేతికంగానే కాదు.. న్యాయపరంగా పలు సమస్యలకు తెర తీసేలా ఉందన్న విషయం ముఖ్యమంత్రికి అర్థమైందంటున్నారు. దీంతో.. జరిగిన నష్టాన్ని.. జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేయటానికి ఆయన ఒక మెట్టు దిగాల్సి వచ్చింది.
అందరూ కోరుతున్నట్లే.. పాత పద్దతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను చేయాలని డిసైడ్ చేశారు. దీంతో.. ఇంతకాలం నీరసించిన వారంతా ప్రభుత్వ నిర్ణయానికి సంతోషించటం ఖాయం. ఇదే మొండితనాన్ని కాస్త ముందుగా వదలించుకొని ఉంటే.. ప్రభుత్వానికి ఇప్పటి వరకు జరిగిన డ్యామేజీలో కొంతమేర అయినా తప్పి ఉండేదని చెప్పక తప్పదు.