తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలపై క్యూ న్యూస్ చానెల్ సీఈవో తీన్మార్ మల్లన్న కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తన ఫొటోలను మీడియా ముందు తప్పుగా ప్రదర్శిస్తన్నారంటూ మల్లన్న పై ప్రియాంకా అనే యువతి ఫిర్యాదు చేయడంతో మల్లన్న ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆ సమయంలో కేసీఆర్ పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదాలు చేయాల్సింది తన ఆఫీసులో కాదని, కేసీఆర్ ఫాం హౌస్ లో అని, కేసీఆర్ కు వరంగల్‌లోనే రాజకీయ సమాధి కడతానని మల్లన్న షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే నిన్న జరిగిన మీడియా సమావేవ:లో మల్లన్ననుద్దేశించి పరోక్షంగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కొంతమంది మీడియా పేరుతో హద్దులు దాటుతున్నారని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది గంటల్లోనే తీన్మార్ మల్లన్నను ఓ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకపోతే తనను చంపుతానని తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేశారంటూ మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు ప్రకారం పోెలీసులు కేసు నమోదుచేసి చర్యలు తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 3న చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో మల్లన్నను విచారణ జరిపారు. ఆ తర్వాత ఆగస్టు 8 న మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించారు. కానీ, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, విచారణకు హాజరు కాలేనని తన లాయర్ ద్వారా పోెలీసులకు మల్లన్న సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, శనివారం కోర్టులో మల్లన్నను హాజరుపరిచారు. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టులో మల్లన్న బెయిల్ పిటిషన్ వేయగా.. సెప్టెంబర్ 9వరకు 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. ప్రస్తుతం తీన్మార్ మల్లన్నను చంచల్‌గూడ జైల్‌కి తరలించారు. ఈ నెల 29న మల్లన్న పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో హడావిడిగా అరెస్టు చేయడం వెనుకు రాజకీయ కారణాలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
కాగా, పోలీసులు అరెస్టు చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న ట్విట్టర్ అకౌంట్లో వచ్చిన ఓ ట్వీట్ కలకలం రేపుతోంది. ” లక్ష్మీకాంత్ శర్మ మీద 17 షోలు వ్యక్తిగతంగా వెంటాడి చేయడం తప్పుచేసినట్టున్నాను ” అన్న ట్వీట్ వైరల్ అయింది. అయితే, స్వయంగా తీన్మార్ మల్లన్న హ్యాండిల్ చేసే ట్విట్టర్ అకౌంట్ నుంచే ఆ ట్వీట్ రావడం విశేషం. కానీ, ఆ ట్వీట్ తాను చేయలేదని, తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని తీన్మార్ మల్లన్న కోరినట్టుగా తెలుస్తోంది.