అనుకున్నట్లే దీపావళి వచ్చింది.. వెళ్లిపోయింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా వెలువడే వీలుందని చెప్పక తప్పదు. ఇప్పటివరకు ఉన్న అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యనే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా రివ్యూ నిర్వహించిన బాబు.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు ఉందని.. తమ బలాన్ని చూపించేందుకు వీలుగా ఎన్నికల్లో పోటీ చేయాలని బాబు భావిస్తున్నారు. తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో గ్రేటర్ లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి బాధ్యతలు అప్పజెప్పి.. నాలుగు దశల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నారు.
అన్ని రకాలుగా సమర్థవంతమైన.. బలమైన.. గెలిచే నాయకులకు అవకాశం ఇవ్వాలని బాబు సూచించారు.
తాజా ఎన్నికల్లో టీడీపీ బలం బయటకు వస్తే.. దాని ప్రభావం మొత్తం తెలంగాణలోనూ ఉంటుందన్న అభిప్రాయం బాబు వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి టీడీపీ గెలవకపోయిన పెద్ద ఎత్తున ఓట్లను సాధించిన విషయాన్ని మరిచిపోకూడదు. 2018 ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీచేస్తే గెలవని సీట్లలోను టీడీపీ భారీ ఓట్లతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అయితే, తెలుగుదేశానికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే… టీడీపీ పోటీ చేస్తే కేసీఆర్ సెంటిమెంట్ ను వాడుకుంటారు. దానివల్ల టీఆర్ఎస్ లాభపడుతుంది. ఈ విషయాన్ని గట్టిగా తిప్పిగొడితే.. మళ్లీ టీడీపీ బలపడే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగింది. ఇక సెంటిమెంట్ ఇపుడు వర్కవుట్ కాదు. 7 ఏళ్లు అధికారం ఇస్తే కేసీఆర్ హైదరాబాదును వరద నీటిలో ముంచేశాడు అన్న విషయాన్ని బలంగా చెప్పగలగాలి. తెలుగుదేశం తెలంగాణ పార్టీ… బీజేపీ, కాంగ్రెస్ లు ఉత్తరాది పార్టీలు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించేలా టీడీపీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని బాబు గుర్తించారా? అన్నదే అసలు ప్రశ్న.