తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల పక్షపాతినని చెప్పుకొనే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. తమకు అనుకూలంగా లేరని.. టీడీపీకి సానుభూతి గా ఉన్నారని భావిస్తూ.. వినుకొండకు చెందిన కొందరు రైతుల మిర్చి పొలాలను వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.
తాజాగా ఆయా పొలాలను పరిశీలించిన టీడీపీ సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. రైతు లకు మద్దతు ప్రకటించారు. వైసీపీ నాయకుల అరాచకాలను ఆయన ఎండగట్టారు. ముఖ్యంగా టీడీపీకి మద్దతుగా ఉన్నారనే రైతుల పొలాలను ధ్వంసం చేసి మొక్కలు పీకేశారని విమర్శించారు. ఈ ఘటన వెనుక బొల్లా అనుచరులు ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు.. రైతుల పక్షాన టీడీపీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
వినుకొండ మండలంలోని పలువురు రైతులు ఆది నుంచి కూడా టీడీపీకి మద్దతుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జీవీకి మద్దతుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీ చేస్తున్న కార్యక్రమాలకు కూడా రైతులు హాజరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఆయా రైతుల పొలాల్లోని మిరప మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయడంతోపాటు.. పొలాల్లో వైసీపీ జెండాలను పాతి పెట్టడం గమనార్హం.
దీనిని ఖండిస్తూ.. రైతులు ఉద్యమించారు. ఎమ్మెల్యేకు బొల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలను గమనించిన జీవీ ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యటించి పొలాలను పరిశీలించారు. రైతులకు మద్దతుగా నిలిచారు. మిరప మొక్కల నష్టాన్ని అంచనా వేసి.. రైతులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. ప్రాథమికంగా 8 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున సాయం అందించారు.