మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబు ఏడాది పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని.. సంక్షేమాన్ని కనుమరుగయ్యేలా చేశారని విమర్శించారు. రాష్ట్ర వృద్ధిరేటు దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. ఉర్సా భూములపై కూడా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు.
జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని.. పదే పదే అబద్ధాలు చెప్పడం, వాటిని ప్రజలు నమ్ముతారనుకోవడం జగన్ పిచ్చితనమని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సోమిరెడ్డి.. జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఇడ్లీ, వడ రేటుకు ఉర్సాకు భూములు ఇచ్చామని జగన్ కారుకూతలు కూస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. 99 పైసలకే ఉర్సా సంస్థకు భూములు కేటాయించామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అది నిజం కాకపోతే జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు.
అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో రాష్ట్రాన్ని 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రెండో స్థానంలో నిలబెట్టింది. కానీ జగన్ మాత్రం గ్రోత్ రేటు దారుణంగా పడిపోయిందని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ఓవైపు మద్యపాన నిషేధం అంటూనే మరోవైపు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలను బలిగొన్నారని.. ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దుయ్యబట్టారు.