వైసీపీ హయాంలో ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామపై మాజీ సీఎం జగన్ కస్టోడియల్ టార్చర్ కు ఆదేశించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రోద్బలంతోనే సీఐడీ చీఫ్ సునీల్ తనపై కస్టోడియల్ టార్చర్ చేశారని, తనను దారుణంగా హింసించారని రఘురామ ఆరోపించారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఆ ఆరోపణలపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా జగన్ పై రఘురామ కేసు పెట్టిన వైనం సంచలనం రేపింది.
జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా రఘురామ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని జగన్, సునీల్ లపై రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, వారిపై సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఏ3గా జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు. ఏ1గా మాజీ డీజీ సీఐడీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా అప్పటి జీజీహెచ్ డాక్టర్ ప్రభావతి పేర్లను నమోదు చేశారు.
తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా వినకుండా తన ఛాతిపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించారని రఘురామ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టమొచ్చినట్టు కొట్టారని రఘురామ ఆరోపించారు. తనకు చికిత్స చేసిన అప్పటి జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒత్తిడి ప్రకారం తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ ఆమె ఇచ్చారని ఆరోపించారు. జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్‌కుమార్ బెదిరించినట్లు ఆరోపించారు.