తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు ఇటీవల అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత ఇంటి నిర్మాణం అక్రమంగా జరిగిందని, దానిని కూల్చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నడిరోడ్డుపై బైఠాయించారు. అంతేకాదు, జేసీబీ తీసుకువచ్చి ఆ అక్రమ నిర్మాణం కూల్చేవరకు ఆయన అక్కడే ఉండడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలోనే ఆయనపై కేసు కూడా నమోదైంది. ఆ ఘటన మరువక ముందే తాజాగా కొలికలపూడి శ్రీనివాసరావు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
రహదారిపై గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కొలికపూడి శ్రీనివాసరావు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఆ గుంతలో స్టూల్‌పై కూర్చుని కొలికలపూడి నిరసన తెలిపిన వైనం హాట్ టాపిక్ గా మారింది. వర్షాల వల్ల ఆ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో కొలికలపూడి దృష్టికి ఆ సమస్యను స్థానికులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే కొలికలపూడి ఇలా నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఆర్అండ్బీ ఏఈ గాయత్రి…కొలికలపూడితో మాట్లాడారు. సదరు రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1.96 కోట్లు మంజూరు చేసిందని,, ఎన్నికల కోడ్ వల్ల పనులు నిలిచిపోయాయని క్లారిటీనిచ్చారు. త్వరలోనే ఆ రోడ్డుపై గుంతలు పూడ్చి మరమ్మతులు చేస్తామని ఎమ్మెల్యే కొలికలపూడికి చెప్పారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కొలికలపూడి కోరారు. ఆ తర్వాత రోడ్డుపై నిరసన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సారి కొలికలపూడి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందనలు వచ్చాయి. కానీ, గతంలో అయితే, సత్వర న్యాయం అంటూ వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఇంటిని కూల్చివేసిన ఘటనలో కొలికలపూడి తీరుపై విమర్శలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదు కావడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు సహనంతో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.