టీడీపీ లో లేడీ ఫైర్ బ్రాండ్ ఆమె. కానీ తేడా వస్తే ప్రతిపక్షం అయినా సొంత పార్టీ అయినా ఒక్కటే అన్నట్టుగా వ్యవహరించే ఆమె.. ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి ఇంకా చెప్పాలంటే ఏకంగా చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. తాజాగా నంద్యాలలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మినీ మహానాడు వేదికగా అఖిల్ ప్రియ మాట్లాడుతూ.. పార్టీ పట్ల, భూమా కుటుంబం పట్ల అంకితభావంతో ఉన్నవారికి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. `శ్రీకాంత్ అన్న పార్టీకి, తమ కుటుంబానికి ఎంతో చేశారు. ఆయన ప్రొఫైల్ ను ఇప్పటికే లోకేష్ కు ఇచ్చాము.. అలాగే చంద్రబాబుకు ఇచ్చి వచ్చాము. కానీ అదే మండలం నుంచి ముక్కు మొహం తెలియని వారు ఎవరైనా వెళ్లి పదవి తెచ్చుకుంటే ఆళ్లగడ్డ నియోజవకర్గంలో అడుగు కూడా పెట్టనివ్వం` అంటూ అఖిల ప్రియ హెచ్చరికలు జారీ చేశారు.
పదవులు ఇవ్వాలనుకుంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ఇవ్వాలని.. అంతే తప్ప మాకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే ఊర్లో అడుగుపెట్టనివ్వమంటూ అఖిలప్రియ టీడీపీ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా, నంద్యాల జిల్లా టీడీపీ కొత్త సమన్వయకర్తగా శిరివెళ్ళ మండలానికి చెందిన గోగిశెట్టి నరసింహారావును నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఆయనకు కాకుండా అదే మండలానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ అఖిలప్రియ అధిష్టానానికి సూచించారు. కానీ, భూమా అఖిలప్రియ పై స్థానికంగా పార్టీ నేతల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ ఆమె సూచన పట్టించకోలేదు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పార్టీ విజయంలో కీలక పాత్రను పోషించిన గోగిశెట్టి నరసింహారావుకే జిల్లా టీడీపీ కొత్త సమన్వయకర్తగా నియమించాలని హైకమాండ్ నిర్ణయించిందని బలంగా టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానికి అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.