సీఎం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ జగన్ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన నడుస్తోందని వారు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే, ప్రభుత్వం, పోలీసుల తీరు ఏమాత్రం మారలేదు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ సొంత జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోట. జగన్ ఇలాకా అయిన పులివెందులలో టీడీపీ కార్యకర్త పరమేశ్వర్ రెడ్డిని ప్రత్యర్థులు పాశవికంగా హతమార్చడం సంచలనం రేపుతోంది.
దిద్దేకుంట నుంచి సింహాద్రిపురం వెళ్తున్న పరమేశ్వర్ రెడ్డిపై రాళ్లతో దాడిచేసిన దుండగులు ఆయనను దారుణంగా హత్య చేశారు. పరమేశ్వర్ రెడ్డి ప్రయాణిస్తున్న బైకును మరో వాహనంతో ఢీ కొట్టి సినీ ఫక్కీలో హతమార్చారు. పరమేశ్వర్ రెడ్డిని ఈడ్చుకుంటూ వెళ్లి రాళ్లతో దాడి చేసి మరీ చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు, పరమేశ్వర్ రెడ్డి దారుణ హత్యను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఫ్యాక్షన్ హత్యలు ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం అని అచ్చెన్న దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.
పరమేశ్వర్ రెడ్డిని హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరమేశ్వర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.