తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కొందరు ఆణిముత్యాల్లాంటి కొందరు నేతలే. వారి కమిట్ మెంట్ పార్టీకి పెట్టనికోటలా మారుస్తుంది. పార్టీ పట్ల వీర విధేయతతో వ్యవహరించే వారు పలువురు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గ టీడీపీ నేత వరపుల రాజా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న పలువురు టీడీపీ నేతల్లో ఆయన ఒకరు. పలుమార్లు అరెస్టు ముప్పు నుంచి నాటకీయంగా తప్పించుకున్నఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. అలాంటి ఆయన శనివారం రాత్రి వేళ హఠాన్మరణం చెందిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారింది.
అప్పటివరకు బాగానే ఉన్న ఆయన హటాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురి కావటం.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ.. ఆయన్ను దక్కించుకోలేని పరిస్థితి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన కొద్దిరోజులుగా ముమ్మర ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన స్వగ్రామం పత్తిపాడుకు చేరుకున్నారు. పార్టీ శ్రేణులు.. బంధువులతో రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మాట్లాడారు.
కొద్దిసేపటికే తీవ్ర గుండెపోటు రావటంతో ఆయన్ను హుటాహుటిన కాకినాడలోని అపోలోకు తరలించాలి. వైద్యులు ఎంతగానో శ్రమించినప్పటికీ రాత్రి 11.20 గంటల వేళలో వరపుల రాజా కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు. గతంలో రెండుసార్లు గుండెపోటు రావటంతో స్టంట్లు వేశారు. ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజా.. డీసీసీబీ ఛైర్మన్ గా.. అప్కాబ్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరించిన ఆయన.. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.
ఈసారి ఎన్నికల్లో ప్రత్తిపాటి నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేసే విషయంలో ఆయన తిరుగులేని అభ్యర్థిగా పేరుంది. అలాంటి నేత హటాత్తుగా కన్నుమూయటం టీడీపీకి.. పార్టీ అధినేత చంద్రబాబుకు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు. 47 ఏళ్ల చిన్న వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం షాకింగ్ గా మారింది. ఆయన అభిమానులు.. కార్యకర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.