టీడీపీలో ఎంత మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా చంద్రబాబు తర్వాత ఎవరు అంటే నారా లోకేశ్ పేరే వినిస్తుంది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చంద్రబాబు తర్వాత నెంబర్ టూగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌నే కనిపిస్తున్నారు. ప్రభుత్వంలోనూ సెకండ్ పొజిషన్ పవన్‌దే. దీనికి తోడు తనదైన మార్క్ పాలనతో పవన్ నేషనల్ వైడ్‌గా తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా తెలుగు తమ్ముళ్లకు ఈగో స్టార్ట్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ప్రభుత్వంలో లోకేశ్ మార్క్ కనిపించాలంటే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ పలు చోట్ల టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అగ్ర నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి నేరుగానే చంద్రబాబుకు విన్నపం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కడప పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సభాముఖంగా బాబుకు ఓ విన్నపం చేశారు
`తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 43 ఏళ్ల తర్వాత మూడో తరం నాయకుడిగా నారా లోకేశ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తులో పార్టీకి భరోసా ఇవ్వాలన్నా, యువతకు భరోసా ఇవ్వాలన్నా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయండి. ఇది మా కోరిక` అంటూ శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా డిప్యూటీ సీఎం పదవి అనేది చట్టబద్ధం కాదు. జగన్ హయాంలో ఐదుగురు నేతలు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకరి కంటే ఎక్కువమంది డిప్యూటీ సీఎం గా వ్యవహరించారు.
అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని పవన్ ప్రతిపాదన తేవడంతో.. అందుకు చంద్రబాబు అంగీకరించారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరినే నియమించారు. ఇప్పుడు పవన్ తో పాటు లోకేష్ కు కూడా సమాన హోదా దక్కాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.