తప్పులు మాత్రమే చేస్తా.. ఒప్పులు చేయటం ఇష్టం లేదన్నట్లుగా ఉంటుంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. వరుస దెబ్బలతో జరిగిన అంతర్మధనం కారణంగా గ్రేటర్ ఎన్నికల్లో మాటకు కూడా బయటకు రాని చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్లను రంగంలోకి దించారు. తన తీరుకు భిన్నంగా ఆయన తాజా వ్యూహం ఉంది. వాస్తవానికి ఇదే విధానాన్ని అమలు చేయాలని బాబును కోరినా.. ఆయన వినే వారు కాదు. ఎవరికి వారు వారి గొప్పతనం గురించి చెప్పుకుంటూ అస్సలు బాగోదు. అవతలోళ్లు చెబితే ఆ లెక్క వేరుగా ఉంటుంది.
తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు.. వారి తరఫున ప్రచారం చేస్తున్న తెలుగుతమ్ముళ్ల ప్రసంగాలు మీడియాలో కనిపించటం లేదు కానీ యూట్యూబ్ లలో సందడి చేస్తున్నాయి. గంటల వ్యవధిలో వేలాది మంది చూడటమే కాదు.. వాటిని షేర్ చేసుకుంటున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ కు బాబు ఏం చేసిండు? అని ప్రశ్నించే గొంతులకు.. తడి ఆరిపోయేలా తమ్ముళ్లు చెబుతున్న మాటలు వింటున్న టీడీపీ అభిమానులకు కొత్త శక్తి వచ్చినట్లుగా ఉందంటున్నారు.
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మార్చటంలో బాబు ఎంత కీలకభూమిక పోషించారన్న విషయాన్ని తమ్ముళ్లు అంత్యప్రాసలతో వివరిస్తున్న తీరు ఓటర్లను ఆకట్టుకోవటమే కాదు.. తెలుగుదేశం అభిమానులకు సాంత్వన కలిగిస్తుందని చెబుతున్నారు. టీడీపీ నేత నర్సిరెడ్డి ప్రసంగం ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
కేసీఆర్ వర్సెస్ బాబు పాలన అంటూ నర్సిరెడ్డి ప్రసంగానికి చెందిన పన్నెండు నిమిషాల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా చూసిన తమ్ముళ్లు.. ఇలాంటి నేతల్ని నలుగురిని తయారు చేసుకొని పార్టీ తరఫున ప్రచారం చేయిస్తే సరిపోయేదానికి.. ప్రతి దానికి నేనున్నానంటూ వచ్చే కన్నా.. బయటకు రాకుండా ఇలాంటి హార్డ్ కోర్ టీడీపీ నేతల్ని రోడ్ల మీదకు వదిలితే పార్టీ ఇమేజ్ దానంతట అదే పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. చేతిలో ఉన్న నేతల్ని వాడకుండా మొన్నటివరకు తప్పు చేసిన చంద్రబాబు.. తాజాగా గ్రేటర్ లో అనుసరించిన వ్యూహాన్ని రాబోయే రోజుల్లో అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.