వైసీపీ హయాంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మాచర్లలో రాజకీయ హత్యలు ప్రోత్సహిండం మొదలు పోలింగ్ నాడు ఈవీఎం బద్దలు కొట్టడం వరకు పిన్నెల్లి అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలోనే అరెస్టయిన పిన్నెల్లికి తాజాగా బెయిల్ లభించింది. అయితే, బెయిల్ లభించిన ఆనందం కాసేపు కూడా లేకుండా పిన్నెల్లికి మాచర్ల వైసీపీ కౌన్సిలర్లు షాకిచ్చారు. బెయిల్ పై ఉన్న పిన్నెల్లి మాచర్ల వచ్చేసరికి మాచర్లలో వైసీపీకి ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉండడం షాకింగ్ గా మారింది.
మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరడంతో పిన్నెల్లికి భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలోనే మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది. ఈ క్రమంలోనే మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత పోలూరు నరసింహారావును మున్సిపల్ ఛైర్మన్ గా 30 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.
పోలూరు నరసింహారావు చైర్మన్ గా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలూరు ఇటీవల టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా మరో 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో, వైసీపీ కంచుకోటగా, పిన్నెల్లి అడ్డాగా మారిన మాచర్లలో టీడీపీ పాగా వేసింది.
మరోవైపు, బెయిల్ సందర్భంగా పిన్నెల్లికి కోర్టు పలు షరతులు విధించింది. రూ. 50 వేల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు వద్ద భద్రతను పెంచారు.