తమిళనాడులో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్న తలైవా రజనీకాంత్ తన పార్టీ చిహ్నంగా సైకిల్ ను తీసుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. చూస్తుంటే రజనీకాంత్ కూడా తెలుగుదేశంపార్టీ నుండే స్పూర్తిపొందినట్లు అనిపిస్తోంది. 1982లో ఎన్టీయార్ మొట్టమొదటగా సైకినల్ ను తన పార్టీ గుర్తుగా ఎంచుకున్నారు. ఎందుకంటే సైకిల్ అనేది పేద, మధ్య తరగతుల వాళ్ళ వాహనం అన్న విషయం తెలిసిందే. సైకిల్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకనే తన పార్టీ గుర్తు ప్రతి ఇంట్లోను గుర్తుండిపోవాలని ఎన్టీయార్ సైకిల్ నే తీసుకున్నారు.
తర్వాత 1992లో పార్టీ పెట్టినపుడు ములాయంసింగ్ యాదవ్ కూడా ఇదే గుర్తును తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం కూడా ఎన్టీయార్ ఆలోచనతోనే సమాజ్ వాది పార్టీ పెట్టినపుడు సైకిల్ గుర్తునే తీసుకున్నట్లు అనుకోవచ్చు. అప్పటి సమైక్య రాష్ట్రంలో అయినా తర్వాత ఉత్తరప్రదేశ్ అయినా సైకిల్ గుర్తుతోనే అధికారంలోకి వచ్చాయి. బహుశా ఇదే విషయం తలైవాలో కూడా ఆలోచన రేకెత్తించుంటుంది.
పైగా రజనీకాంత్ నటించిన అన్నామళై సినిమాలో సైకిల్ పై పాలుపోస్తు పాటపాడుతారు. ఆ పాట బాగా పాపులరైందట. అందుకనే రజనీ ఆలోచనలో సైకిల్ గుర్తు బాగా నిలిచిపోయిందని తమిళ మీడియా బాగా ఊదరగొడుతోంది. తమిళ మీడియాలో వచ్చిందంటే ఇక అదే విషయం తెలుగురాష్ట్రాల్లో కూడా వైరల్ అయిపోవటం పెద్ద విషయం కాదు.
అందుకనే తాను స్ధాపించబోయే పార్టీ గుర్తుగా రజనీకాంత్ సైకిల్ నే ఎంపిక చేసుకుంటారట. మొత్తానికి సైకిల్ గుర్తన్నది బాగా పాపులర్ అవుతున్నట్లే ఉంది. కాకపోతే ఓ చిన్న సమస్య కూడా ఉంది. అదేమిటంటే టీడీపీ అయినా సమాజ్ వాదీపార్టీ అయినా జాతీయపార్టీలు. మరి రెండు జాతీయపార్టీలు ఉపయోగించుకుంటున్న సైకిల్ గుర్తును రజనీకాంత్ తన పార్టీ గుర్తుగా ఎలా పెట్టుకుంటారు ? అన్నది తేలాలి.
అయితే టీడీపీ అయినా ఎస్పీ అయినా పెట్టినపుడు ప్రాంతీయ పార్టీలే. ఆ తర్వాతే జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. నిజానికి పై రెండుపార్టీలు జాతీయపార్టీలే కానీ వాటికి తమిళనాడుతో ఏమీ సంబంధాలు లేవులేండి. అందుకనే రజనీకాంత్ పార్టీ గుర్తుగా సైకిల్ ను తీసుకోవాలే కానీ ఈ రెండుపార్టీల నుండి అబ్జెక్షన్ వచ్చే అవకాశాలు దాదాపు ఉండవనే అనుకోవాలి. చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఏ విషయం తేలిపోతుంది కదా.