టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఎంత అండర్ స్టాండింగ్ గా పాలన సాగిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీ నేతల మధ్య ఎప్పటికప్పుడు విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈగోలకు పోయి నాయకులు అనవసర రచ్చకు తెర లేపుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా విశాఖ డిప్యూటీ మేయర్ కూటమిలో చిచ్చు పెట్టింది. పదవి కోసం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా నాయకులు ఫైట్స్ చేసుకుంటున్నారు.
వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ఇటీవల కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం వేసి నెగ్గారు. ఈ నేపథ్యంలోనే నేడు విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తూ కూటమి నిర్ణయం తీసుకుంది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్‌ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేయడం కూడా పూర్తి అయింది. అయితే జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించడం పట్ల టీడీపీ కేడర్ భగ్గుమంది.
అధిష్టానం నిర్ణయంపై అలిగిన కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు సమన్వయ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టడంతో కోరం సరిపోలేదు. ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కాగా.. 54 మంది మాత్రమే హాజరు అయ్యారు. దాంతో రేపటికి ఎన్నికను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక అలకబూనిన టీడీపీ కౌన్సిలర్లతో అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.