ఏపీలో ప్రజానాడి ఎలా ఉందనే విషయంపై `ఏబీపీ – సీ ఓటరు` సంస్థ సర్వే చేపట్టింది. ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ప్రజానాడి ఎలా ఉందనేది తేల్చి చెప్పింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఏ పార్టీకి పట్టంకట్టనున్నారనే విషయంపై ఏబీపీ సీ ఓటరు అంచనా వేసింది. దీని ప్రకారం.. ఏపీలో ఎన్డీయే కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన పక్షం వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలిపింది.
ఏపీలో నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా..అందులో 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించనుందని సర్వే తెలిపింది. కేవలం 5 స్థానాల్లో మాత్రమే.. అధికార వైసీపీ విజయం సాధించబోతున్నట్లుగా పేర్కొంది.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఈ కూటమి 2014లోనూ కలసి పోటీ చేసి విజయం సాధించింది. అప్పట్లో 18 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలను గెలుుకునే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ తేల్చింది.
సీట్లు ఇలా..
కాంగ్రెస్ 0, టీడీపీ+జనసేన+బీజేపీలు సంయుక్తంగా 20 స్థానాల్లో గెలవనున్నాయి. ఇక, వైసీపీ కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది.
ఓట్ల షేరింగ్ ఇలా..
కాంగ్రెస్ పార్టీ 3%, టీడీపీ+జనసేన+బీజేపీలు సంయుక్తంగా 44.7%, వైసీపీ 41.9% ఓటు షేరును దక్కించుకోనున్నాయి. దీనిని బట్టి పోరు మాత్రం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వచ్చాయి.
ఎన్డీఏ కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమికి మూడు శాతం రాగా.. ఇతరులకు పది శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక సీట్ల పరంగా చూస్తే.. బీజేపీ 3(ఆరు స్థానాల్లో పోటీ చేస్తే) పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన 17 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.