ఏపీలో పోస్ట్ పోల్ వయొలెన్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్న వైనంపై ఏపీ సీఎస్, ఏపీ డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వారి వివరణ ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు పలు ప్రాంతాలలో పోలీసు, రెవెన్యూ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయినా సరే, ఏపీలో హింస మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో తాజాగా టీడీపీకి ఓటు వేశాడన్న అక్కసుతో టీడీపీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేసిన వైనం సంచలనంగా మారింది.
ప్రకాశం జిల్లాలోని పందువ గ్రామానికి చెందిన తిమోతి కొద్ది రోజుల క్రితం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తిమోతి…తన బంధువులు, ఇరుగుపొరుగువారి దగ్గర వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత ఈ దాష్టీకానికి పాల్పడ్డాడు. తిమోతిపై అక్కసుతో స్థానిక వైసీపీ నేత గురవయ్య…రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగి పడింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, టీడీపీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కృష్ణమూర్తి స్పందించారు. తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల నాయకత్వాన్ని అణగదొక్కేలా వైసీపీ యత్నించిందని ఆరోపించారు. పార్టీ మారిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై రెండేళ్ల పాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.