టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి గత పదేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని వినిపించిన పుకార్లు పుకార్లుగానే మిగిలాయి. 2023 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని మరో పుకారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తూనే ఉన్నాయి.
అయితే, తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ గతంలో మీడియా ముఖంగా ప్రకటన చేశారు. కానీ, తారక్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ మాత్రం అపుడపుడు బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేస్తుంటారు.ఈ నేపథ్యంలోనే జూ.ఎన్టీఆర్ రాజకీయ పునరాగమనంపై నందమూరి మరో వారసుడు, హీరో తారక రత్న కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ తన తమ్ముడని, నందమూరి రక్తం ఆయనలో ఉందని తారక రత్న అన్నారు. సినిమాలతో తారక్ బిజీగా ఉన్నాడని, అవసరమైనప్పుడు రాజకీయ రంగంలోకి దిగుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక్ ను పక్కన పెడుతున్నారన్న అసత్య ప్రచారాన్ని తారక రత్న కొట్టిపారేశారు. నందమూరి, నారా కుటుంబాలు రెండూ ఒకటేనని, ఏపీ బాగుపడలంటే మామ చంద్రబాబు మళ్లీ సీఎం కావాల్సిందేనని చెప్పారు.
కొడాలి నాని గురించి మాట్లాడేంత సమయం, ఓపిక కానీ తనకు లేవని షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్లకు మైకులున్నాయని ఏదో మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలను తెలుసుకునే పనిలో తామున్నామని అన్నారు. విమర్శిస్తున్న వారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, అయితే, స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వారసులుగా ప్రతి ఒక్కరూ తమను అభిమానిస్తున్నారని, ఇంతకంటే ఏం కావాలని అన్నారు.