‘నమస్తే ఆంధ్ర’ ఇంతకుముందే వ్యక్తం చేసినట్లుగా, ‘భరత్ మద్దినేని’ ‘తానా’ బ్యాలెట్లో కోశాధికారి పదవికి చేర్చడానికి TRO పొందారు. ఇది చివరి దశ ఎన్నికల ప్రచారంలో ‘నరేన్ కొడాలి’కి మరియు అతని ప్యానెల్‌కు పెద్ద ఉపశమనాన్ని అందించినట్లయ్యింది.
ఇప్పటికే సీనియర్ లీడర్ ‘గోగినేని’, ‘టీమ్ కొడాలి’టీమ్‌కి సపోర్ట్ చేయడం ద్వారా చాలా మద్దతు లభించింది. ఈ TRO బ్యాలెట్లో ‘భరత్’ని చేర్చడం వారి మనోధైర్యాన్ని మరింత పెంచినట్లయ్యింది.
మరో రెండు వారాల్లో రానున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తితో ఎన్నారై సమాజం ఎదురుచూస్తోంది.
ఒకసారి ఎన్నికల కమిటీ ఆమోదం పొందాక కూడా అకస్మాత్తుగా కుంటి సాకులు చూపుతూ అట్లాంటా కు చెందిన భరత్ మద్దినేనిని ‘తానా’ కోశాధికారి పదవి పోటీ నుంచి తప్పిస్తూ తీసుకున్న’తానా’ బోర్డ్ నిర్ణయంతో ఎన్నికల్లో ఉండవలసిన నైతిక హద్దులు చెరిగిపోయి మళ్ళీ లీగల్ మరియు వర్గ పోరాటాలు తారాస్థాయికి చేరాయి.
కోర్టు ఆదేశాల ప్రకారం 2023-25 టర్మ్ కొరకు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకు ముందు జరుగుతూ ఉన్న ‘తానా’ ఎన్నికలను సర్దుబాటు ముసుగులో క్యాన్సిల్ చేసి ఉన్న అన్ని పదవులను వర్గాల మధ్య ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అంతకుముందు, తర్వాత జరిగిన, జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తే ‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు గా నైతిక హద్దులు చెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. క్రింద వివరించిన వివరాలను బట్టి మీరే నిర్ధారించుకోండి.
2023 ఎన్నికల ప్రారంభానికి ముందు
పూర్వ అధిష్టానం మద్దతుతో 2021-23 టర్మ్ నకు పోటీ చేసి పరాజయం పాలైన ‘నరేన్ కొడాలి’ తిరిగి పోటీ కి సిద్ధమయ్యారు. అందుకు గాను మళ్ళీ ఎన్నికల్లో ముందంజ వేయడానికి గాను కొత్త సభ్యత్వాలను ఇబ్బడి ముబ్బడిగా చేర్పించారు. ఇదేమీ ‘తానా’ లో కొత్త విషయం కాదు.
‘నరేన్’ ను ‘జయ్ తాళ్ళూరి’ మరియు ‘లావు వర్గాలు’ కలసి ఓడించినప్పటికీ తీవ్ర బేదాభిప్రాయాలతో వెంటనే విడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో వెనుకబడి పోకుండా ఈ వర్గాలు కూడా యధా శక్తి సభ్యత్వ నమోదు చేయించారు. తరువాతి అంకంలో గ్రౌండ్ లెవెల్ వాస్తవిక పరిస్థితిని బట్టి ఏవో ఒక రెండు వర్గాలు కలిస్తే కానీ స్పష్టమైన మెజారిటీ ఉండని పరిస్థితిలో ‘నరేన్ వర్గం’ ‘లావు వర్గం’ కలిసి పనిచేయడానికి ఆంతరంగిక అవగాహనకు రావడంతో మిగిలిన ‘జయ్ తాళ్లూరి’ వర్గానికి సంకట స్థితి ఏర్పడింది.
ఈ లోగా మూడు వర్గాలు కలసి 3 మిలియన్ల డాలర్లు పైగా ఖర్చుతో చేసుకున్న 30 వేల పైగా సభ్యత్వాలకు ఓటు హక్కు సకాలంలో రాకుండా పోయింది. అది కూడా వచ్చి ఉంటే ‘నరేన్-లావు’ వర్గాలకు ఎన్నికల్లో ఎదురే లేదనే విషయం బాగా తెలిసిన ‘జయ్ తాళ్లూరి’ వర్గం కొద్దిగా ఊపిరి తీసుకుని అదనపు మద్దతు కొరకై ప్రత్నామ్యాయ మార్గాల వెతుకులాటలో పడింది. ఈ లోగా ఈ ఓటు హక్కు రాకపోవడానికి సాంకేతిక లోపమే గాని సభ్యుల తప్పులేదని వాదిస్తూ ఓటుహక్కు కై ‘నరేన్ వర్గం’ కోర్టు ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ లోగా ఎన్నికలు సమయం రావడంతో ‘నరేన్-లావు’ వర్గాలు క్షేత్రస్థాయి బలంతో అత్యుత్సాహంగా ప్యానెల్ కూర్పును ‘టీం కొడాలి’ పేరుతో సిద్ధమయ్యాయి. అంతేకాక కోర్టు ద్వారా కొత్త సభ్యులకు ఓటు హక్కు కై చేసే ప్రయత్నం సఫలమైతే మరో 5 వేల పైగా ఓట్లు మెజారిటీ సమకూరే అవకాశం కూడా ఉంది. ఇక ఈ బలహీనత గురించి ముందే తెలిసిన ‘తాళ్లూరి వర్గం’ ఎన్నిక అవగాహన అంటూ నరేన్ వర్గం తో ప్రయత్నాలు సాగించినా లావు వర్గం ప్రతిఘటనతో పెద్దగా ముందుకు సాగలేదు. ఈ అంతరాన్ని పూడ్చి గెలుపు అవకాశాలు పెంచడానికి గాను సీనియర్ నాయకుడు, తటస్థులుకు అభిమాని అయిన’ శ్రీనివాస గోగినేని’ ను తమ ప్యానెల్ కు నాయకత్వం వహించడానికి ఆహ్వానించారు. అప్పటికే అనేక పదవులు నిర్వహించి వర్గాల కతీతంగా రెండు సార్లు పోటీ చేసి అపజయం పొందిన కారణంగా ఈ సారి పూర్తి ప్యానెల్ మద్దతుతో పోటీ చేయడానికై అంగీకరించి ‘టీం గోగినేని’ పేరుతో ఉధృత ప్రచారం గోగినేని కొనసాగించారు.
ఇదే సమయంలో హోరాహోరీగా సాగుతున్న పోటీలను అదనుగా ఉపయోగించుకుంటూ ‘తాళ్లూరి’ వర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ పదవులు పంచుకొనే ప్రతిపాదనను తెరవెనుక కొనసాగించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతూ తమ వర్గానికి చెందిన ‘తానా’ ప్రెసిడెంట్ ‘లావు అంజయ్య’ చేయవలసిన ‘తానా’ కాన్ఫరెన్స్ కొద్దివారాల్లో ఉండటంతో అర్ద మనసు తో లావు వర్గం కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకు గాను జరుగుతున్న ఎన్నికలను ‘తానా’ బోర్డు ముందుగా రద్దుచేసి ‘తానా’ కాన్ఫరెన్స్ పూర్తి అయిన మరునాడే వర్గాలకు సంబంధిన వారితో ఎటువంటి పరిశీలన కూడా లేకుండా అప్రజాస్వామికంగా పదవులను సెలక్షన్ పద్దతి ద్వారా పంచారు.
ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే ఈ సర్దుబాటు వ్యవహారాన్ని తమ ప్యానెల్‌ని తమను నమ్మి విజయానికై అన్ని విధాలా కృషి చేస్తున్న’గోగినేని’కి ఇసుమంతైనా సమాచారం ఇవ్వలేదు. అలాగే వ్యతిరేక ప్యానెల్ లీడ్ అయిన నరేన్ ను ప్రెసిడెంట్ గా ఒప్పుకుంటూ కనీసం ప్రత్నామ్యాయ పదవికి కూడా ‘గోగినేని’కి అవకాశం లేకుండా ‘జయ్ తాళ్లూరి’ వర్గం తమ వందిమాగధులతో తమ భాగాన్ని పూరించుకున్నారు. ఇంకా ఘోరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయని సతీష్ వేమూరి కి, ఎన్నికల్లో పెద్దగా కృషి చేయని వారికీ ముఖ్యమైన బోర్డు పదవులను కట్టబెట్టి ‘గోగినేని’ ని పూర్తిగా విస్మరించడం ప్రత్యర్థి ప్యానెల్ వాళ్ళకే అవమానంగా అనిపించింది. అంతకుముందే తన స్వంత ప్యానెల్ సెక్రెటరీ గా పోటీ చేస్తున్న ‘అశోక్ కొల్లా’ తమ ప్రెసిడెంట్ అభ్యర్థి గోగినేని కి ఓటు వేయకపోయినా పర్లేదు తమకు వేస్తే చాలన్నట్లు చేసిన నీతిబాహ్యమైన చర్యలకు మనస్థాపం చెంది ఉన్న ‘గోగినేని’ తరువాతి విపరీత పరిణామాలతో కలత చెందినట్లు చెప్పారు.
అయితే పదవులను ‘ఇష్టం’తో ఇచ్చిపుచ్చుకోవడం గాక కేవలం ‘తప్పక’ పంచుకోవడం మాత్రమే జరగడం వలన కలిసి పనిచేయలేమని గ్రహించిన మైనారిటీ వర్గం కోర్టుకు వెళ్లి ఈ సెలక్షన్ రద్దు చేయించి ఎన్నికలను మళ్లీ తెప్పించింది. కోర్ట్ సెలక్షన్ ప్రక్రియ రద్దు చేస్తూ, పాత 15 మంది బోర్డు సభ్యులను నియమిస్తూ, తిరిగి ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది. ఇక్కడి నుండి అనైతిక రాజకీయం యధావిధి మళ్లీ పురి విప్పింది. ‘జయ్ తాళ్లూరి’ వర్గానికి బోర్డు లో ఉన్న స్వల్ప మెజార్టీ ఉపయోగించుకుంటూ ఎన్నికల విధులను దాటి కొన్ని అసాధారణ నిర్ణయాలను కూడా తీసుకోవడం మొదలు పెట్టింది.
‘టీం నరేన్’ వర్గం తిరిగి ఇంచుమించుగా అదే ప్యానెల్ తో సమాయత్తమవ్వగా, ‘గోగినేని’కు ఇంతకు మునుపు చేసిన అమర్యాదను సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ‘జయ్ తాళ్లూరు’ వర్గం అది చేయక పోగా, మరింత స్వార్థ పూరిత చర్యలకు పాల్పడ్డటం అనేకమందిని ఆశ్చర్యపరచింది. ఎన్నికల రద్దుకు ముందు జరిగిన ఎన్నికల పోరాటంలో ఓటమికి భయపడకుండా టీం లీడ్ చేసిన ‘గోగినేని’కి ఉన్న సానుభూతిని కూడా కాదనుకుని ఆయనకు మళ్ళీ సమాచారం కూడా ఇవ్వకుండా కొత్త గా ‘సతీష్ వేమూరి’ ని తమ ప్యానెల్ హెడ్ గా ఎన్నుకున్నారు.
ఇందుకు ముఖ్య కారణాలుగా..
1. ‘గోగినేని’ వర్గ ప్రయోజనాలకు కాకుండా సంస్థ ప్రయోజనాలకే ప్రధమ ప్రాధాన్యమిస్తారని,
2. అలాగే ఈ సారి ఆ 30 వేలు కొత్త ఓట్లు రావని తెలియటం మూలంగా గెలిచే ఛాన్స్ ఉండవచ్చని,
3. నరేన్ కొడాలిపై ఏమైనా అనర్హత వేటు వేయవచ్చా అని,
4. చివరిగా ఈ సారి సర్దుబాటు లేకుండా ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి కనుక ఆ ఛాన్స్ తమ వర్గ వ్యక్తికే చెందాలనేదే ఆలోచనగా తెలుస్తోంది.
ఈ పరిణామం ‘గోగినేని’ని సమర్ధించే అనేకమందికి అసంతృప్తి కలిగిస్తూ ఆయన భవిష్య నిర్ణయం కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన ‘తానా’ బోర్డు ఆ పనులతో పాటు కొసరు పనులు కూడా చేస్తూ అనేకమందికి అనుమానం రేకెత్తించింది. ముఖ్యంగా ‘లావు’ వర్గానికి చెందిన ‘వాసు కొడాలి’ ని దురుసుగా మాట్లాడారని సాకుతో సస్పెండ్ చేసి బోర్డు లో ఓటింగ్ పెంచుకోవడం, ‘లావు అంజయ్య’ కి ప్రెసిడెంట్ లేదా పాస్ట్ ప్రెసిడెంట్ గా కూడా గుర్తింపు ఇవ్వకపోవడం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ను మళ్ళీ నియమించడం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిని ఉదహరిస్తూ ‘వాసు కొడాలి’, ‘లావు అంజయ్య’ లు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, ‘నరేన్ కొడాలి’ కూడా ఈ బోర్డు పై నమ్మకం లేదని, కోర్టు ఆదేశాలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు రిసీవర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని లీగల్ కేసులు వేయడం జరిగింది.
వీటన్నింటికీ పరాకాష్ఠగా ట్రెజరర్ పదవికి నామినేషన్ వేసి ఆమోదం కూడా అయిన ‘భరత్ మద్దినేని’ ని ‘తానా’ ఎగ్జిక్యూటివ్ మీటింగులకు హాజరు కావడం లేదంటూ 4 సంవత్సరాలపాటు ఎన్నికల నుంచి బహిష్కరిస్తూ ఆమోదింపబడిన నామినేషన్ ను కూడా రద్దు చేయడం అనేక విమర్శలకు గురైంది. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే తన బహిష్కరణను ఈ శుక్రవారం లోగా ఆపాలని లేకపోతే కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తానని తెలియజేయటం తో ఇప్పటికైనా ఈ ఎన్నికలు జరుగుతాయా అనే సందేహాలు పలువురు వెలిబుచ్చుతున్నారు.