గత శుక్రవారం (మార్చి 19) న నార్త్ కరోలినా చార్లెట్ నగరం లో ‘తానా’ లైఫ్ మెంబెర్స్ నివసించే ప్రాంతాలలో రాత్రి పూట ఒక్కసారిగా కొద్దిసేపు ఉరుములు మెరుపులతో భూమి కంపించగా సభ్యులు కంగారు పడుతూ అటూ ఇటూ పరుగెడుతూ గందరగోళానికి గురయ్యారు.చివరికి తెలిసిందేమిటంటే అక్కడికి మూడు గంటల కారు ప్రయాణ దూరంలో ఉన్న రాలీ నగరంలో రంకెలు వేస్తూ తదుపరి అధ్యక్షులు ‘లావు అంజయ్య చౌదరి’ సవాళ్లు విసురుతూ ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి తొడలు కొట్టుకున్న దాని ప్రకంపనల ప్రభావమని. ఇది వినటానికి విట్టీగా ఉన్నా వర్గాల మధ్యన జరుగుతున్న దూషణల పర్వం ఇంకెన్ని విపత్తులు తెస్తుందోనని తెలుగు ప్రజలు అమెరికా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.
‘నరేన్ ప్యానెల్’ గాడ్ ఫాథర్స్ కున్న వీర భక్తులు సాయత్రం అయితే చాలు తమ దేవుళ్ళకు స్తోత్ర పఠనాలు చేస్తూ, లేటు నైట్ అయిన తరువాత దండకాలు కూడా చదువుతున్నారు. ఇక ‘నిరంజన్ ప్యానెల్’ రైలుకు గార్డ్, ఇంజిన్ లైన ప్రస్తుత, తరువాత ‘తానా’ అధ్యక్షులు తమకున్న పదవులు, కనెక్షన్లు వాడి చాలా మందిని మెంటరింగు చేస్తూ వచ్చే టర్మ్ లో పదవుల ఆశ చూపుతూ తమ ప్రచారానికి రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్లలో కొంతమంది చేసే అతి ప్రచారం మూలంగా చాలామంది చిరాకు పడటమేగాక వ్యతిరేకులవుతున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా ‘మేరీలాండ్ లో ఒకాయన’ చెలరేగిపోతుండగా, ‘చార్లెట్ లో ఒకాయన’ పొద్దున్నే మైదాపిండి బకెట్లో ఉడకబెట్టుకుని, ప్రతి వాట్సాప్ గ్రూప్, ఫేసుబుక్ లో ‘నిరంజన్ ప్యానెల్’ పోస్టర్లను అంటించిందే మళ్లీ మళ్లీ రాత్రి వరకు అంటించే కార్యక్రమంతో లాభమేంటో గాని నష్టం మాత్రం దానికి రెట్టింపు ఖాయం.
‘నరేన్’ మరియు ‘నిరంజన్’ వర్గాలు రెండూ తమ ప్యానెల్ మెంబెర్స్ తో పాటు తమ గాడ్ ఫాథర్స్ లను కూడా కలుపుకొని ఊరూరా తిరుగుతూ కోవిద్ పండెమిక్ సిట్యుయేషన్ ని కూడా లెక్క చేయకుండా సమావేశాలు నిర్వహిస్తూ చేస్తున్న రకరకాల వ్యాఖ్యానాలు తెలుగు కమ్యూనిటీ తమదైన పద్దతిలో అర్ధం చేసుకుంటున్నారు. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకుందాం
నరేన్ ప్యానెల్ కబుర్లు
నరేన్: ‘తానా’ సేవలోనే గత 20 సంవత్సరాలుగా, గత 20 సంవత్సరాలుగా,గత 20 సంవత్సరాలుగా!!
పబ్లిక్ టాక్: అర్థమైంది గానీ, కుర్చీల అలంకరణ గాక నిజంగా చేసిందేమిటో చెప్పు సామి, వెతుక్కోవడం కష్టంగా ఉంది సారూ!
నరేన్: నాతో పాటు పనిచేసే కార్యకర్తలను నమ్ముకుని, కార్యకర్తలను నమ్ముకుని, కార్యకర్తలను నమ్ముకుని!!!
పబ్లిక్ టాక్: ‘తానా’ లో పని చేసే వారు కార్యకర్తలు కాదు సామీ స్వచ్ఛంద సేవకులు అంటారు, ఓహో మీరు చెప్పేది మీకు,మీ అధిష్ఠానానికి పని చేసే కార్యకర్తల గురించా?
నరేన్: ఇంక్లూసివ్ అంటే అందరినీ కలుపుకొని, అందరినీ కలుపుకొని, అందరినీ కలుపుకొని!!!
పబ్లిక్ టాక్: భలే చెప్పావు సామీ, మీ గాడ్ ఫాదర్ లే కదా మాట వినని అందరినీ ‘తానా’ బయటకు తోలేదీ!
పెద్దాయన: ‘నిరంజన్’ కు ఆరేళ్లలోనే అన్నీ కావాలి అంటే ఎట్టా కుదురుద్దీ, ఎట్టా కుదురుద్దీ!!
పబ్లిక్ టాక్: మీరే కదా ఒకే పదవి రెండు సార్లు కూడా ఇచ్చామంటున్నదీ, ఓహో అప్పుడు మీ అడుగులకు మడుగులెత్తేవారా!!
నిరంజన్ టాక్: ఎంకాదు,కొద్దిగా ముందే ఎదో కమిటీలో కూడా చేశా సారూ!
పెద్దాయన:లావు అంజయ్య కూడా ఆరేళ్లలోనే ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతె కొంపలంటుకుపోయినట్లు!
పబ్లిక్ టాక్: అంత చెప్పేవారు అప్పుడు ఇప్పుడు సీనియర్ ‘గోగినేని’ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నట్లు? అర్థమైంది, మీరు చెప్పేదాని కల్లా తలలూపేవారు కావాలనా? బాగా ఊపారు కదూ?
అంజయ్య టాక్: 2011 లోనే టీం స్క్వేర్ లో చేరా, పదవులు దానం చేసినట్లు చెప్పుతున్నారు
పెద్దాయన: తెలివిగల కుందేలు ముతరాసి గాడి వల్లో పడినట్టు!
పబ్లిక్ టాక్: ఆగండాగండి,ఇక్కడ ముతరాసి వాడెవడు? తెలివుందనుకుంటున్న కుందేలు ఎవరు ??
పెద్దాయన: ఉడత ఊపులకు చింతకాయలు రాలుతాయన్నట్లు!
పబ్లిక్ టాక్: చింతకాయలా? తాటి కాయలనుకుంటున్నామే!!
పెద్దాయన: నరేన్ గారు చదువుకున్నవాడు, ఈగో లెస్ పర్సన్ కనుక బెస్ట్ సూటేడ్ ఫర్ ‘తానా’ ప్రెసిడెంట్
పబ్లిక్ టాక్: అలాగా? ఇక్కడ చదువుకోని వారు ఎవరూ లేరు కనక, మీ దగ్గర ఈగో చూపించకపోతే చాలన్నమాట, భలే భలే!!
పెద్దాయన: చేంజ్ చేంజ్ అంటున్నారు, అన్ని పదవుల్లోనూ వాళ్ళే ఉంది ఇంకా ఏంటి తెచ్చేది చేంజ్? డీసీ కాన్ఫరెన్స్ లో పాత ప్రెసిడింట్ 200 మంది తో డయాస్ మీద హడావిడి చేస్తే, ప్రమాణ స్వీకారంలో జయ్ తాళ్లూరి కూడా ఒక ఎంపీ, ఒక మంత్రి, 200 మంది కుటుంబం, జిల్లా వాళ్ళతో కలసి హడావిడి చేయలేదా?
పబ్లిక్ టాక్: చేంజ్ అనకపోతే మనవాడైన, జయ్ తాళ్లూరి అయినా చేసేది ఓకేనా, అర్ధమవుతోంది సారూ!
పెద్దాయన: తానా ఎలక్షన్స్ మంచివే, సభ్యులు చక్కగా ఉన్న అభ్యర్థులందరి ప్రొఫైల్స్ చూసి నచ్చిన వారికి ఓటు వేయవచ్చు
పబ్లిక్ టాక్: అబ్బా ఛా! మరి గోగినేని కూడా ఇదే కదా మొత్తుకుంటోంది. మనలో మాట, రెండు వర్గాలు బాలట్ కలెక్షన్ల లెక్కలు ప్రతి రోజూ ఎందుకు వేస్తున్నట్లో?
నిరంజన్ ప్యానెల్ కబుర్లు
నిరంజన్: మా ప్యానెల్ స్లోగన్ ఏంటంటే చేంజ్ అండి!!
పబ్లిక్ టాక్: ఇది ఇంతకు ముందెక్కడో విన్నట్లుందే ?
నిరంజన్: ఇంకా మా ప్యానెల్ చెప్పేది ‘తానా మనందరిదీ ‘అండి!!
పబ్లిక్ టాక్: అరే, ఇది కూడా ఇంతకూ ముందెక్కడో విన్నట్లుందే ?
నిరంజన్: మరి ఈ చేంజ్ అనేదీ నౌ ఆర్ నెవెర్ అండీ!!
పబ్లిక్ టాక్: గుర్తొచ్చేసిందోచ్, ఇవన్నీ మన ‘గోగినేని’ ‘తానా ఫౌండేషన్ చైర్మన్’ గా ఉన్నప్పటినుంచీ చెపుతున్నవే కదా- అయన దగ్గర ట్రెజరర్ గా పనిచేసినా వాడేసుకోవటానికి ఆయనకూడా పోటీలోనే ఉన్నారు కదా మరి? ఓహో కాపీ రైట్ లేదు కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చేమో. కార్పొరేట్ వాళ్ళు మామూలోళ్లు కాదు బాబోయ్!
నిరంజన్: చేంజ్ అనేది నిజానికి జయ్ తాళ్లూరి గారు 2019 లోనే మొదలెట్టేసారు, ఇపుడు కంటిన్యూ చేస్తానికి ఆ నినాదం పెట్టుకున్నాం!
పబ్లిక్ టాక్: కంటిన్యూ చేయడాన్ని చేంజ్ అనరండీ బాబూ!
డబుల్ పబ్లిక్ టాక్: అంతకు ముందు తమరు ఫౌండేషన్ చైర్మన్, అంతకుముందు తమరి జయ్ గారు చైర్మన్, లావు గారు సెక్రటరీ అంటే చేంజ్ ఎప్పటినించో జరుగుతూనే ఉందా, ఇప్పుడు తమరు దొర్లించుకుంటూ వెళ్తారా?
నిరంజన్: చేంజ్ అంటే రియల్ చేంజ్ తేవాలి
పబ్లిక్ టాక్: అంటే ఇప్పుడు ప్రెసిడెంటు, తరవాతి ప్రెసిడెంటు, ఆపై అవుతామనుకుంటున్న తమరినీ మార్చేయమంటున్నారా? మావి చిన్న బుర్రలు సార్, ఇంతే అర్ధమవుతుంది మరి!
నిరంజన్: చేంజ్ అంటే ఇంతకు ముందు లా రాజకీయ పార్టీల ప్రాపకం మార్చాలి
టీడీపీ టాక్: అంటే పవర్లో లేదని పార్టీయా మార్చేస్తారా? రామ రామ! గోల గోల! రామ రామ! గోల గోల!
పబ్లిక్ టాక్: ముందు మాట్లాడటం నేర్చుకో బాబూ!
నిరంజన్: అబ్బెబ్బే, ‘తానా’ వేరు, రాజకీయం వేరు అని చెప్పాలనికున్నా- నిజానికి నేను అదే పార్టీయే!!
వైసీపీ టాక్: అంటే మా ఓట్లు అక్కర్లేదా? చూద్దాం, చూద్దాం సారూ!
టీడీపీ టాక్: మేము మళ్ళీ చేర్చుకోము గాక చేర్చుకోము!
పబ్లిక్ టాక్: చెప్పంగదా నాయన, మాట్లాడం నేర్చుకొమ్మని. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడి అయ్యావు కదా!
నిరంజన్: ర్యాలీ మీటింగ్ లో మళ్లీ చెపుతున్న, నేను అదే పార్టీ అని!!
వైసీపీ: అది చెప్పటానికా మమ్మల్నందరినీ ఈ సమావేశానికి పిలిచింది? ఏమి చేయాలో మాకూ తెలుసు-
పబ్లిక్ టాక్: మీరైనా చెప్పండ్రా గాడ్ ఫాదర్ లూ, మాట్లాడం నేర్చుకొమ్మని!
నిరంజన్: మాది చేంజ్ తో పాటు పారదర్సకత కూడా!
పబ్లిక్ టాక్: అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్పరెన్సీ, అంటే అన్నీ విప్పి చూపిస్తాం అనే కదా-మరి ఆ వంద వేలు డాలర్లు ఇచ్చామని చెప్పడమేకాని, ఎన్ని సార్లు అడిగినా లెక్క చెప్పినట్లు లేదే? మా బుర్రలు చిన్నవి లెండి!
నిరంజన్ టాక్: ఆ పెద్దయిన అంటున్నట్లు 6 ఏళ్ళు కాదు, కొద్దిగా ముందే ఎదో కమిటీలో కూడా చేశా ..
పబ్లిక్ టాక్: అయన అదే అంటున్నాడు, కొద్దిగా అటూ ఇటూ ఎదో చేసినట్లుంది అని, ఇక్కడ దశాబ్దాల తరబడి కమిటీల్లో చేసిన వాల్లున్నారండీ ఏ పదవులు ఆశించకుండా
గల్లీ నాయకుడు: మా నిరంజను వంద వేలు లెక్క అడుగుతున్నారు. అసలు వచ్చాయా లేదా, ఖర్చు పెట్టామా లేదా? బోర్డు నైనా, సెక్రటరీ నైనా అడగండి, వెంటనే ప్రూవ్ అవుతుంది.
పబ్లిక్ టాక్: అందుకే బాబూ గల్లీ నాయకుడంటున్నదీ. బోర్డును అడిగిన, ఆయన్ను అడిగినా, నిన్ను అడిగినా ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు, మాకేమో క్యూరియాసిటీ పెరిగి పోతోంది, అదేమంటే నాది చేంజ్, ట్రాన్స్పరెన్సీ అంటారు. వీటి అర్ధమేంటమ్మా?
అంజయ్య: నేనేదో ఆరేళ్లకే ప్రెసిడెంటయిపోదామని హడావిడి చేశానన్నారు, నేను 2011 లోనే టీం స్క్వేర్ లో చేరా- లెక్కలు చూసుకోండి పెద్దాయినా!
పబ్లిక్ టాక్: మీరు బీకామ్ లో లెక్కలు చదివారా? 2011 లో టీం స్క్వేర్ లో చేరితే 2013 కదా మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ పోసిషన్ చేసింది, ఎలక్షన్ 2019 లో జరిగితే అప్పటికి 6 ఏళ్ళు కూడా పూర్తవలేదనే కదా- కాళ్ళ వెళ్ళా పడి బోర్డ్ లో టీం స్క్వేర్ సేవకై గ్రేస్ మార్కులతో పాసయ్యింది. మేము మర్చిపోలేదు సారూ!
అంజయ్య: నాకు ప్రెసిడెంట్ పదవినేదో దానం చేసినట్టు చేప్పారు, నేను మిగతా అన్ని పదవులకు పోటీ చేసి గెలిచా తెలుసా?
పబ్లిక్ టాక్: అదే సారూ అందరూ అనేదీ, మిగతా పదవులప్పుడూ అందరూ కలిసే ఓట్లు వేశారు, ప్రెసిడెంట్ అప్పుడూ పోటీయే లేకుండా చేసారు. పనంతా అయ్యాకా గాని తెలియలేదు నీలో ఇంకొకొడున్నాడని సారూ!
అంజయ్య: ప్రెసిడెంట్ ఎలక్షనప్పుడు నాతో పాటు నామినేషన్ పడింది, విత్ డ్రా కూడా అయ్యింది. మరి నాకు అప్పనంగా ఎలా ఇచ్చినట్టు ?
శివరాం: డిట్రాయిట్ సీక్రెట్ గా వచ్చి 2 గంటలు ఎవరికీ కనపడకుండా దాక్కుని గాడ్ ఫాదర్ శరణుజొచ్చి ఇంకో గాడ్ ఫాదర్ కోసం డీసీ వెళ్లిన విషయం గుర్తుందా? ఇదిగో ఇక్కడే దాక్కుంది, గుర్తు తెచ్చుకో, లేకపోతే ఈ ఎన్టీఆర్ విగ్రహం చెప్పేస్తుంది సారూ!
పబ్లిక్ టాక్: అదే సారూ- వాళ్ళు చెప్తోంది, బోర్డులో నామినేషన్ వాలిడ్ చేయించి, పోటీ విత్ డ్రా చేపించి కొంప ముంచుకొన్నామని!
డబల్ పబ్లిక్ టాక్: 2019లో నీ బదులు ‘గోగినేని’ కి ఇచ్చి ఉంటే ‘తానా’ నూ బాగుపడేదీ, మాకూ పరువు దక్కేది, నీ గొడవ వదిలేది అని అప్పటి అధిష్టానం ఒకరి లెంపలు ఒకరు కొట్టుకుంటున్నారట!
అంజయ్య: ఇప్పుడీ ఎలెక్షనంటే భయపడేది ఏమీ లేదు, రండి చూసుకుందాం!!
పబ్లిక్ టాక్: నీదేమి పోయింది సారూ- గెలిస్తే పేరు మీకు-ఓడితే నష్టం ప్యానెల్ కే కదా-మన పబ్బం గడిసి పోయింది కదా-అవతలి ప్యానెల్ గెలిచినా వారిని బుట్టలో వేయడం నీకు తెలిసిన విద్యే కదా సారూ!
అంజయ్య: సాఫ్ట్ గా ఉన్నానని నన్ను సాఫ్ట్వేర్ అనుకుంటున్నారేమో, మాస్ అలాగే ఉంది. రండి చూసుకుందాం!!
పబ్లిక్ టాక్: ఇది ఏ సినిమాలోదబ్బా? ఇంటి పేరు ‘లావు’ కదా అని తొడలు ఒకటే బాదుకోకండి సారూ-,కాళ్లు వాచి ప్యాంట్స్ మార్చుకోవటానికి ఖర్చు దండగ!
జయ్ తాళ్లూరి: గత 10 ఏళ్లలో చేసిన మొత్తం పనులు కంటే ఈ రెండేళ్లలో ఇంకా ఎక్కువ పనులు తక్కువ ఖర్చుతో చేసేసాం తెలుసా?
పబ్లిక్ టాక్: కోవిద్ టైం లో కూడా ఎదో సెయ్యాలని ప్రయత్నించారు కానీ మాస్కుల గొడవ మూలంగా వెబ్ కామ్ లతో సరిపెట్టు కొవాల్సొచ్చింది. అయితే వీటిలో జాయిన్ అయ్యే టైం ఎవరికుంది నాయకా? భోజనాలు, డెకొరేషన్ వగైరా ఖర్చులెలాగూ లేవు. అలాగే పిల్లలు వెబ్ కామ్ లకు పెద్దగా ఖర్చు ఉండదని చెప్పారే!
జయ్ తాళ్లూరి: పిల్లలకు తెలుగు నేర్పడం కోసం పాఠశాలను 75 వేల డాలర్స్ కి కొనుగోలు చేసాం!!
పబ్లిక్ టాక్: అప్పుడు పెద్దాయనతో మనకి టర్మ్స్ బాగున్నాయనుకుంటా. కాని మాకో డౌటు,మెంబెర్ అడ్రస్ అప్డేట్ పేజీని కూడా మైంటైన్ చేయలేని మీ నాయకత్వం ఈ ప్రోగ్రాం సాఫ్ట్వేర్ ని తక్కువ ఖర్చులో మైంటైన్ చేయగలదా నాయకా?
జయ్ తాళ్లూరి: ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది చూడాలి!!
పబ్లిక్ టాక్: క్లాస్ హీరో అని చెప్పుకుంటూ మాస్ డైలాగ్ ఏంటి నాయకా మరీనూ,మీరు ప్రెసిడెంట్ మరియు కార్పొరేట్ కదా కొంచం డిగ్నిఫైడ్ గా ఉంటే బాగుండేది. ఇంతకీ బుల్లెట్ ఎవరు, దిగేది ఎక్కడ? అది కూడా చెప్తే తప్పట్లు ఇంకా పడేవేమో?
ఇలా రెండు వర్గాలూ ఊళ్లు తిరుగుతూ తెలుగు ప్రజలకు, మీడియా వాళ్లకు మంచి కాలక్షేపాన్నిస్తుంటే, ‘శ్రీనివాస గోగినేని’ మాత్రం ఈ ఊళ్లన్నీ మన ఊరికోసం కోసం ఒకసారి, గతం లో పోటీ చేసినప్పుడు ప్రచారం కోసం తిరగటం మూలాన అందరితో సంబంధాలు ఇంతకు ముందే ఏర్పరచుకొని వాటి విషయాలను, ఫోటోలను పేస్ బుక్స్ లో పెట్టుకుంటూ రక రకాల మార్గాల్లో ప్రస్తుత పరిస్థితులు వివరిస్తూ, ‘తానా’ సాధారణ ఓటర్లను ఆకట్టుకొంటూ తనకున్న క్లీన్ ఇమేజీ తో ఎన్నికల్లో ఉన్న రెండు వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ‘తానా’ సభ్యులు వర్గ నాయకుల ద్వారా కొత్తగా పరిచయమవుతున్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థులు చెపుతున్న విషయాలను, నిజమైన పరిస్థితులను, ‘గోగినేని’ ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా వివరిస్తున్న విషయాలను బేరీజు వేసినప్పుడు అధిక సంఖ్య లో ఆయనకు ఆకర్షితులవుతున్నట్లు రెండు వర్గాల వారే ఒప్పుకుంటుండడం జరగబోయే పరిణామాలపై మిక్కిలి ఆసక్తి కలిగిస్తూంది. అడ్రస్ అప్డేట్ భాగోతం మూలంగా బాలట్ పోస్టింగ్ నకు ఇంకా మూడు వారాలు సమయం ఉండడటంతో వ్యవహారాలు ఇంకెన్నెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.
ముఖ్య గమనిక:నిరంజన్ ప్యానెల్, పెద్దాయన అడ్డాలోకి తొడలు కొట్టుకుంటూ, జబ్బలు చరుస్తూ, బే ఏరియా బ్రదర్స్ గుండెల్లో బుల్లెట్స్ దించుతాకి ఈ వీకెండ్ వస్తున్నట్లు సమాచారం–జరా భద్రం బే ఏరియా!!