‘తానా’ సంస్థకు సంబంధించి గత 6 సంవత్సరాల వ్యవహార లన్నింటిపై అమెరికా అత్యున్నత సంస్థ FBI విచారణ చేస్తున్న కారణంగా సంస్థ భవితవ్యంపై వివిధ రకాలుగా అలజడి చెలరేగుతున్న నేపథ్యంలో ‘తానా’ శ్రేయోభిలాషియైన ‘నమస్తే ఆంధ్ర’ నుంచి వివరణాత్మక వ్యాసం..
అనేక దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ‘తానా’ సంస్థ అమెరికా తెలుగువారి ‘గుండె చప్పుడు’ గా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగుతుండడం విదితమే.
‘తానా టీం స్క్వేర్’ ద్వారా ఎవరికి ఏ ‘ఆపత్తు’ వచ్చినా, కులమత విచక్షణ లకు అతీతంగా నేనున్నానంటూ ముందుకు వచ్చే ‘తానా’ ఎవరూ ఊహించని విధంగా తనంత తానే ‘విపత్తు’ లో ఇరుక్కోవడం అత్యంత బాధాకరం.
ఇటీవలి కాలంలో ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్న వివిధ సమస్యలు ఒక్కసారిగా కలబడి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా సంస్థ భవితవ్యానికి సవాలుగా పరిణమించాయి.
గత కొద్ది సంవత్సరాలుగా వివిధ వర్గాలు మరియు వ్యక్తుల మధ్యన మెల్లగా మొదలైన అధిపత్య పోరాటాలు, అధికార మార్పిడులు క్రమక్రమంగా వ్యక్తిగత స్పర్థలు, వివాదాలుగా మారుతూ ‘చిలికి చిలికి గాలి వాన’ స్థాయి నుంచి ‘పెను తుఫాను‘గా మారి పరస్పర సహకార లోపంతో సంస్థ మనుగడకే ముప్పుగా పరిణమిచడం ‘తానా’ సభ్యులకు, అభిమానులకు ఎంతో వేదన కలిగిస్తుంది.
అలా మొదలైంది!
‘నమస్తే ఆంధ్ర’ గత కొన్ని సంవత్సరాలుగా ‘తానా’ లో వివిధ వర్గాల మధ్యన జరుగుతున్న ‘మూడు ముక్కలాట’ ను ఎప్పటికప్పుడు విపులంగా వివరిస్తూ ‘పోరు నష్టం పొందు లాభం’ అంటూ హెచ్చరించింది.
అయినప్పటికీ ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్లు’ గా ‘ఎవరికి వారే యమునా తీరే’ మాదిరి ‘తానా’ సంస్థ ప్రతిష్ట కంటే తమ తమ వర్గాల ఆధిపత్యమే ముఖ్యమంటూ ఆడుకున్న ‘పవర్ త్రో బాల్’ ఆటలో చివరికి ప్రఖ్యాత ‘తానా’ సంస్థ పరిస్థితి ‘అడకత్తెర లో పోకచెక్క మాదిరి’ పరిణమించింది.
చాలా సంవత్సరాలు సంస్థను శాసించిన ‘స్వయం ప్రకటిత అధిష్టానం’ ప్రతిభ, నిబద్ధత మరియు నిర్వహణ సామర్థ్యం ఉన్న వారి కంటే తమ ‘అడుగులకు మడుగులు ఒత్తే’ వంది మాగధులనే ఎక్కువగా ప్రోత్సహించింది.
అలాగే స్వంత నిధులతో నకిలీ ‘సభ్యత్వ ఓటర్ల’ చేర్పింపులు చేసిన వ్యక్తులు – గుంపులు మధ్యన చేసిన ఎన్నికల ‘ముఠా’ రాజకీయాల మూలంగా ఏర్పడిన మూడు వర్గాలూ ‘ఆ తాను ముక్కలే’.
ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఏదో ఒక వర్గం సహకారం లేకపోతే సంస్థ దరిదాపుల్లోకి కూడా ఏ కార్యకర్త వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
చివరకు పరిపక్వత, క్రమశిక్షణ, నిబద్ధత లేని నాయకత్వం కారణంగా సంస్థను నడిపే విధి విధానాల్లో నైతికత కొరవడి ‘తానా’ పరిపాలనా చట్టాన్ని(బై లాస్) లెక్కకు మించిన సార్లు అతిక్రమిస్తూ, చివరికి ఎంతో జాగ్రత్తగా ‘చెక్స్ అండ్ బాలన్స్‘ తో నిర్వహించాల్సిన ఆర్థిక లావాదేవీలను కూడా ‘గుడ్డిగా’ నిర్వహించడంతో ‘కొంప కాస్తా కొల్లేరు’ అయ్యే పరిస్థితికి వచ్చింది.
‘కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చుండ పెట్ట – కంచె చేను మేయదా?’ అన్న చందాన బాధ్యత కలిగిన నాయకులే స్వంత ఖాతాలకు మిలియన్ల కొద్దీ డాలర్లను బహిరంగంగా మళ్ళించుకోవడం, ‘తానా’ కాన్ఫరెన్స్ నిర్వహణకై వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులను ప్రలోభ పరచి ‘మ్యాచింగ్’ నిధులను పెద్ద ఎత్తున సమీకరించారంటూ ఆరోపణలు రావడం వంటివి విన్నపుడు ‘అడుసు తొక్కనేల – కాలు కడగనేల’ అనిపించక పోదు.
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
1) ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగాడుతున్న FBI నోటీసు ప్రకారం 2019 జనవరి 1 నుంచి నేటి వరకు జరిపిన అన్ని లావాదేవీలు (డిపోసిట్స్, డొనేషన్స్, కార్పొరేట్ మాచింగ్ ఫండ్స్, ఎండ్ బెనెఫిషరీ తో కూడిన ఖర్చులన్నింటి వివరాలు), అలాగే కార్యవర్గ సభ్యుల వివరాలు, మీటింగ్ మినిట్స్, ఇతరత్రా కార్యకలాపాలన్నిటి సమాచారం మొత్తం వెంటనే ఇవ్వాల్సిందిగా ‘తానా’ ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ సమాచారాన్ని ఎలా ఇవ్వాలి, ఇచ్చినా ఇందులో ఏదైనా ‘తీగ లాగితే డొంకంతా కదిలినట్లు’ కొంప మునుగుతుందా అనే ఆందోళనలతో ముఖ్యమైన ‘తానా’ నాయకులు గుంభనగా ‘గుంపు చింపులు’ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
2) మాజీ ‘తానా ఫౌండేషన్ కోశాధికారి, ఎవరినీ సంప్రదించకుండా తన సొంత కంపెనీకి 3.65 మిలియన్ డాలర్ల పైన నిధులు రెండేళ్లపాటు క్రమక్రమంగా మళ్లించడం గత నవంబర్ లో బయటపడి ఇప్పటికే తెలుగు ప్రజలందరినీ షాక్ కు గురిచేయగా ఇప్పటివరకు 500,000 డాలర్లు రాబట్టినప్పటికీ మిగతా సొమ్ము రాబట్టడానికి సరైన కార్యాచరణ ప్రణాళిక ఏమీ కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన FBI నోటీసు ఉపద్రవంతో ‘అగ్నికి వాయువు తోడైనట్లు’ గా సమస్య మరింత తీవ్రమయేటట్లు ఉంది. అయితే నడుస్తున్న పరిణామాల రీత్యా ఈ కేసు కూడా ఒకే FBI విచారణ పరిధిలోకి వస్తే సంస్థ భవితవ్యం ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే’ అని పలువురు భయపడుతున్నారు.
3) సరైన ప్రణాళిక, ముందు చూపు లేకుండానే ఈ జూలై 2025 లో ‘తానా కాన్ఫరెన్స్’ చేయాలని అదరా బాదర ఎపుడో ప్రకటించినప్పటికీ, ఆ కాన్ఫరెన్స్ నిర్వహణ కమిటీ కూర్పు పూర్తి ఏకపక్షంగా ఉందని పలువురు విమర్శిస్తూండగా, సంస్థ కార్యనిర్వహణాధికారి అయిన ప్రస్తుత ‘తానా’ అధ్యక్షుడే ఈ కమిటీ నిర్మాణ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయ సహాయానికి కోర్ట్ గుమ్మం తొక్కడం సంస్థ లో ఎన్నడూ కనీవినీ ఎరుగని పరిణామం. అయితే అక్టోబర్ లో నిర్వహించిన ప్రారంభ నిధుల సమీకరణతో కొంత నైతిక బలం సమకూరినప్పటికీ ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు’ వెనువెంటనే వచ్చిన పై రెండు పరిణామాలు మూలంగా సమావేశ నిర్వహణ, సామర్థ్యంలపై తిరిగి ఆందోళనలు మొదలైనట్లే. ఇదే అభిప్రాయాన్ని అనేక ‘తానా’ నాయకులూ, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు కూడా ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తీకరిస్తుండడం దేనికి సూచనో చెప్పనక్కర్లేదు.
4) జనవరి చివరి లోగా ‘తానా’ ఎన్నికలకు ‘బై లాస్ ప్రకారం’ నోటీసు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు కనీసం ఎలక్షన్ కమిషన్‌ను కూడా ఏర్పరచకపోవడము ఒకింత ఆశ్చర్యపరుస్తుండగా కొత్తగా సంభవించిన పరిణామాలు మూలంగా అనివార్యమైన ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో తెలియక తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్తుతులలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారా అని కొంతమంది, ఈ ఎన్నికల తరవాత వచ్చే కొత్త కార్యవర్గంతో అయినా సంస్థ తిరిగి గాడిలో పడుతుందేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు
వర్గాల గందరగోళం!
సంస్థ ఆశయమైన ‘సొంత లాభం కొంత మానుకుని, పొరుగువారికి తోడుపడవోయి’ అనే నానుడి మరచిన కొంతమంది నాయకుల రాజకీయ క్రీడలలో ‘తేనె పూసిన కత్తులు’, ‘గోముఖ వ్యాఘ్రాలు’ ‘భట్రాజులు’, ‘దళారీలు’, ‘పెట్టుబడిదారులు’ అనేకులు అంతర్జాతీయంగా వెలిగిపోతున్న ‘తానా’ సంస్థ గొడుగు నీడన చేరడమే గాక స్వలాభం లేదా తాత్కాలిక పరపతి కోసం వర్గాలుగా వీడి సంస్థ పరపతిని ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు’ చిందర వందర చేసారు.
‘వేమన’ గారు ఎప్పుడో ‘మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అని చెప్పినట్లు ఇప్పటి సంస్థ దుస్థితికి వీరందరికీ ‘తిలా పాపం తలా పిడికెడు’ వాటా ఉంది అనిపించక మానదు.
A. తాము ‘జే’యించామనుకున్న ‘అశోక’ సామ్రాజ్యంలో ‘శోకమే’ మిగిలిన ఒక వర్గం ముఖ్య నాయకులు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా,
B. ఇంకో వర్గం ఎన్నికల రాజకీయ పునరేకీకరణ పాచికలతో ‘అదృష్టం కలిసి వచ్చి స్వర్గానికి వెళితే, రంభ కి ‘కోవిడ్’ వచ్చి మూలన కూర్చుంది’ అనే పరిస్థితి లో కొట్టుమిట్టాడుతుండగా,
C. ఉన్నంతలో నైతికత ఉండి ప్రస్తుతం కార్యవర్గాలలో ఆధిక్యత కూడా ఉండి సంస్థను గట్టెంకించాల్సిన మూడో వర్గం ‘లావొ‘క్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్ అన్నట్లుగా సమస్యల ఒత్తిడిలో ఉక్కిరిబిక్కిరవుతూ న్యాయపరమైన లేదా విధానపరమైన సలహా సంప్రదింపుల కోసం పలువురి సహకారం కోరుతున్నట్లు వినికిడి.
జన ఘోష!
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) కు అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు ఉండి కీలక విభాగమైన ‘తానా ఫౌండేషన్’ ద్వారా కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపును కలిగి ఉంది.
ఎంతోమంది దాతలు సంస్థ పై నమ్మకంతో ఫౌండేషన్ మరియు ఇతర సేవా కార్యక్రమాల కోసం నిధులను విరివిగా ఇవ్వడం పరిపాటి కాగా ఇలాంటి నిధులు ఇప్పుడు ప్రక్కదారి పట్టాయన్న విషయం తెలిసిన ‘తానా’ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ముఖ్యంగా ఒక కోశాధికారి తనంత తానుగా ఎవ్వరి కళ్ళు పడకుండా రెండేళ్లపాటు మిల్లిన్ల కొద్దీ డాలర్లు స్వంత ఖాతాల్లోకి మళ్లించగలగడం కరెంట్ షాక్ లాంటిదే కదా.
‘గోరు చుట్టుపై రోకటి పోటు’ లా ఇదేసమయంలో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అత్యున్నత విచారణ సంస్థ FBI గత 6 సంవత్సరాల ‘తానా’ కార్యకలాపాలనన్నిటి పైన తీవ్రమైన దృష్టి సారిస్తుండడం మూలంగా ‘తానా’ భవితవ్యం గురించి అనేకులు ఆందోళన పడుతున్నారు.
ఈ విచారణలో అనేక సందేహాత్మక లావాదేవీలతో పాటుగా ఇప్పటికే మరికొన్ని సంస్థలపై తీవ్ర ప్రభావం చూపిన కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ల సేకరణ పై విచారణ జరిగితే సంచలనాత్మక వివరాలు బయటపడతాయేమోనని ఎక్కువమంది భయపడుతున్నారు.
ఈ మధ్యన కార్యక్రమాల భారీ విజయం కోసం అక్రమమైన ప్పటికీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలైన ఆపిల్, గూగుల్,ఫేస్బుక్, బ్యాంకు అఫ్ అమెరికా వగైరా సంస్థల తెలుగు ఉద్యోగులను ప్రలోభపరచి మాచింగ్ గ్రాంటులను రాబట్టటమనే సంప్రదాయము కట్టుదాటి అనేక ప్రాంతీయ సంస్థలు కూడా ఇటువంటి వాటిల్లో పాల్గొని ‘గుమ్మడి కాయల దొంగ ఎవరంటే ఎవరికి వారు భుజాలు తడుముకున్నట్టు’ ఉందని గుసగుసలాడుతున్నారు.
ఇక జులై నెలలో జరగాల్సిన ‘తానా’ కాన్ఫరెన్స్ విషయంలో ఇప్పటికే అధ్యక్షుడుకీ కాన్ఫరెన్స్ కమిటీకి మధ్యన వచ్చిన తీవ్ర భేదాభిప్రాయాలతో పాటు తెలుగు కమ్యూనిటీ మొత్తం చేయాల్సిన బృహత్తర కార్యక్రమం లో పదవులన్నింటినీ నిస్సిగ్గుగా ఒకే వర్గం వారితో నింపి తెచ్చుకున్న అప్రదిష్ట కు తోడు ‘పుండు మీద కారం చల్లినట్టు’ వచ్చిన ఫౌండేషన్ నిధుల మల్లింపు, FBI విచారణ మూలకంగా కాన్ఫరెన్స్ నిర్వహణ కష్ట సాధ్యమేనని పలువురు భావిస్తున్నారు.
మరి కాన్ఫరెన్స్ పరిస్థితే అనుమానాస్పదమయితే వచ్చే కార్యవర్గం ఎన్నిక లెప్పుడయ్యేను, ప్రణాస్వీకారమెప్పుడు జరిగేనూ, 50 సంవత్సరాల పండుగ ఎలా జరిగేనూ అని వివిధ రకాలుగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇవే విషయాలపై అనేక వాట్సాప్ గ్రూప్‌లలో, మీడియా వార్త కథనాల్లో, టీవీ చర్చల్లో గట్టిగా ప్రస్తావనకు వస్తున్నప్పటికీ, కొంతమంది ‘తానా’ నాయకులు, కాన్ఫరెన్స్ కమిటీ వాళ్ళు ‘ఏమీ కాదు, సమస్య దూది పింజలా తేలి పోతుందని‘ బుకాయిస్తుండడం ఆశ్చర్యమే.
అసలు విషయాన్ని గమనిస్తే ఉన్నతాశయాలతో స్థాపించబడి అత్యున్నత సేవలను గొప్పగా నిర్వహించిన చరిత్ర ఉన్న ‘తానా’ సంస్థ గత దశాబ్ద కాలంగా నాయకుల స్వార్ధపూరిత, ఆధిపత్య మరియు అహంకార ధోరణలు మూలంగా అనేక విమర్శలకు లోనవుతూ పరిపాలనలో పరిశుద్ధతను క్రమ క్రమంగా కోల్పోతూ తెలుగు సమాజంలో పరపతి ప్రశ్నార్ధకం అవుతూ వస్తోంది.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘తానా’ నాయకత్వం మూడు వర్గాలుగా చీలి బేదాభిప్రాయాలతో కొట్టుమిట్టాడుతూ కొన్ని సమస్యలను కోర్టు వరకు తీసుకెళ్లడం అలాగే నిర్లక్ష్యంగా కాన్ఫరెన్స్ నిధులను ఖర్చు పెట్టినా సరైన చర్యలు లేకపోవడం, విచక్షణరహితంగా కార్పొరేట్ మాచింగ్ లకు పాల్పడటం, ఎన్నికల లబ్ధి కోసం నిస్సిగ్గుగా స్వనిధులతో సభ్యత్వ ఓటర్లను చేర్పించటం తో పాటు కార్యవర్గాల్లో ప్రతిభ లేకున్నా స్వంత వారినే నియమించుకోవడం వంటివి మచ్చుకు కొన్నే.
చివరకు ఎంతో మంది పెద్దలు, నాయకులు తమ ప్రతిభతో, ధనంతో, సమయంతో పాటు ఎన్నో త్యాగాలు చేసి సమకూర్చిన గొప్ప చరిత్రను ‘బూడిదలో పోసిన పన్నీరు’ చేస్తారేమోనని భయపడక తప్పని పరిస్థితి.
ఇప్పటికైనా సంస్థను రక్షించు కోవడం తో పాటు మంచి కార్యవర్గాల్ని తెచ్చుకోవాలని, ప్రస్తుతం కార్యవర్గాలలో నిబద్దతతో పనిచేస్తున్న వారితో పాటు గత కొద్ది సంవత్సరాలుగా కార్యవర్గాలకు దూరంగా ఉండి వివాద రహిత నాయకులైన ‘ప్రసాద్ తోటకూర, మోహన్ నన్నపనేని, శ్రీనివాస గోగినేని, లోకేష్ ఈదర, సుబ్బారావు ఉప్పులూరి, ప్రసాద్ నల్లూరి, వీరూ ఉప్పల వంటి వారి’ సలహా, సహాయ, సహకారాలతో కొన్ని సంవత్సరాలు పాలన సాగితే ‘తానా’ భవిష్యత్తు కి ఢోకా ఉండదని పలువురు భావిస్తున్నారు.
జరగాల్సిందిదే!
ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ఏదో విధంగా సంస్థాగత పరంగా సురక్షితంగా బయటపడినప్పటికీ, సమాజపరంగా గౌరవ మర్యాదలను తిరిగి సమకూర్చుకోవాలంటే అత్యంత జాగరూకతోనూ, సమన్వయంతోనూ వివాదాలకు దూరంగానూ కొన్ని సంవత్సరాల పాటు కార్యక్రమాలను నిర్వహించాలి.
ఆ విధంగా ‘తానా’ నాయకత్వము సభ్యులందరి తోడ్పాటుతో తీసుకోవాల్సిన సత్వర ఛర్యలను కొన్ని పరిశీలించితే
1. నిబద్ధత, నిర్వహణ సామర్థ్యం, నిష్కళంక చరిత్ర కలిగి ఉండటంతోపాటు అత్యధికులకు ఆమోదయోగ్య మయ్యే అగ్ర నాయకత్వాన్ని కనీసం 5 లేదా 6 సంవత్సరాల పాటు ఎన్నుకోవడానికి అన్ని వర్గాలు కలసి రావాలి. కొద్దికాలం పాటు సహనం కావాలి, భేషజాలు వీడాలి, అత్యాశలు పోవాలి. కలహ ధోరణిని తగ్గించి సామరస్య భావనలను పెంపొందించుకోవాలి.
2. స్వచ్ఛంద సభ్యత్వాలను ప్రోత్సహిస్తూ నిస్వార్ధ కార్యకర్తలను నెత్తిన పెట్టుకోవాలి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే విషయాన్ని గ్రహించి సంఖ్య కంటే సమర్థత ముఖ్యమని గ్రహించాలి. ఎన్నికల ప్రయోజలకై స్వంత నిధులతో సభ్యుల చేర్పింపును గర్హించాలి.
3. ‘తానా’ ద్వైవార్షిక సదస్సులను పరిమిత నిధులతోనైనా నీతివంతంగా, ప్రభావశీలంగా సమాజం మొత్తానికి స్ఫూర్తిగా ఒక కుటుంబ మరియు సన్నిహితుల సమూహాలతో పండుగలా సంతోషంగా నిర్వహించాలి. రాజకీయ భేషజాలకు, సినిమా గ్లామర్ కు, వ్యక్తిగత ఇమేజ్ లేదా వర్గ ప్రయోజనాలను వీలైనంత తగ్గించాలి.
4. జరిగిన అనర్థాన్ని ఒక గుణపాఠం గా తీసుకుని, ముందు ముందు మళ్ళీ జరగలేని విధంగా ‘తానా బై లాస్’ ని సమీక్షించి అవసరమైన సంస్కరణలను తేవాలి. పరిపాలనలో ‘బై లాస్’ లను ఎల్లవేళలా గౌరవిస్తూ అమలు పరచాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను కనీసం ఇద్దరి సంతకాలు ఉండేలా నిర్దేశిస్తూ, ఎప్పటికప్పడు వివిధ స్థాయిల్లో సమీక్షిస్తూ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి.
5. నాయకత్వ పదవుల లోనికి భజన పరులు, వర్గ ప్రయోజనాలు, గూడు పుఠాణీల కంటే నిబద్ధత, సమగ్రత, నిర్వహణ సామర్ధ్యాలు ప్రాధమికంగా అర్హతలవ్వాలి. ముఖ్యంగా అవకాశవాదులు, స్వార్ధపరులు, వివాదాస్పదులను దూరంగా ఉంచాలి.
6. వీలైన చోటల్లా మహిళలకు, యువతకు, వివిధ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక మద్దతును సమీకరించుకోవాలి.
ఇక ప్రస్తుతం ఉన్న మూడు ముఖ్య వర్గాలు వెనువెంటనే అంటే ఇప్పటికిప్పుడే అంతర్గత సంస్కరణలతో దిద్దుబాటుకు సిద్ధమై మిగతా వారితో కలిసి పని చేయాలి.
A. ఎన్నికల్లో ఓడిన వర్గం గత ఎన్నికలతోనే ప్రయాణం ఆగిపోలేదని తెలుసుకోవాలి. ‘తానా’ సంస్థ ప్రస్తుతం సంక్షోభం నుంచి బయటపడితే తమ వర్గ నాయకుల గత సేవలకు చరిత్ర ఉంటుందనీ, అలాగే తమకూ భవిష్యత్తులో మరింత కీలక అవకాశాలు రావొచ్చని గమనించి సంస్థకు తగిన సహకారాన్ని అందించాలి. తప్పు చేసిన వ్యక్తులకు దండన ఉండే విధంగా ఆశించడం తప్పు కాదు కనుక ఆ విషయంలో తమ కృషిని కొనసాగిస్తూనే సంస్థ మనుగడ కై అంతిమంగా నిలబడుతూ అందు తమ పాత్ర కూడా ముఖ్యమని భావిస్తూ తగిన విధంగా సహకరిస్తూ ప్రజల అభిమానాన్ని తిరిగి సంపాదించాలి. తమ వర్గంలో సేవా దృక్పథం ఉన్న నాయకుల కోసం అవసరమైతే ఒకరిద్దరు వివాదస్పుదులను పక్కన పెట్టాలి. ఇదే వర్గానికి చెందిన ప్రస్తుత అధ్యక్షుడైన ‘నిరంజన్ శృంగవరపు’ నాయకత్వంలో ఈ విధమైన సత్వర చర్యలకు ఉపక్రమించకపోతే జరుగుతున్న అనర్ధాలకు తమవైపే వేలు చూపబడుతుందనీ గమనించాలి. వర్గంలోని ఇతర సమర్థవంతమైన నాయకులు తిరిగి గుర్తింపు పొందడానికి ఇదే మంచి అవకాశం.
B. గతంలో ఆధిపత్యాన్ని నెరపి ప్రాభావాన్ని కోల్పోయి రాజకీయ సమీకరణాల్లో ఒకింత జవసత్వాల్ని కూడ గట్టుకొన్న వర్గం ఇప్పటికైనా తమ అధిపత్య భావాల్ని, ఆశ్రిత పక్షపాతాన్ని, నిర్లక్ష్య ధోరణలను విడనాడి సంస్థ కోసం నిలబడిన వారికి అలాగే మంచి భావాలున్న కొత్త వారికి తగు ప్రాధాన్యం కలిగించాలి. విభజించి పాలిస్తే వచ్చే అనర్ధాలు అవగతమయ్యాయి కనుక కలిసి పనిచేసే విధంగా అందరినీ ప్రోత్సహిస్తే తిరిగి పెద్దరికం తో కూడిన మర్యాదలను పొందవచ్చును. మందీ, మంత్రాంగాల కంటే విలువలు, వ్యక్తిత్వాలే మిన్న అని అంగీకరిస్తూ మిగతా అందరినీ కలుపుకుపోవాలి. సమస్యలను తేలికగా తీసివేయకుండా తగు జాగరూకతతో సామాజిక స్పృహతో పరిష్కరించుకొనే వాతావరణానికి తమ వంతు దోహదపడాలి. ఇందుకోసం తదుపరి అధ్యక్షుడిగా కావలసిన ‘నరేన్ కోడాలి’ నాయకత్వము తీసుకుని అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తూ తనకై బాధ్యతాయుతమైన కార్యవర్గ ఎన్నిక కోసం నిజాయితీగా కృషి చేయాలి. సంస్థను రక్షించుకోవడమే ముఖ్యమనే భావనతో పనిచేస్తూ ఎన్నికైన పదవీ బాధ్యతల రీత్యా వర్గ ప్రయోజనాల కంటే సంస్థ ప్రయోజనాలే మిన్న అనే విధంగా ఉంటే ప్రజల మన్నన పొందగలరు.
C. ఇక మిగిలిన మూడో వర్గం ప్రస్తుత పరిస్థితుల్లో బలమైనదీ, ప్రతిభావంతమైనది కనుక కార్యవర్గాలలో ఉన్న ఆధిక్యత మూలంగా ప్రస్తుత పరీక్షా సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సంక్షోభం నుంచి సంస్థను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగినది. అందరూ భావిస్తున్నట్టుగా మరీ గుట్టుగా, బెట్టుగా, కట్టు గా వ్యవహరించడం మంచిది కాదని గ్రహించి అవసరం మేరకు అనుభవజ్ఞులను, ఇతర వర్గాలలో సంస్థ పై అనురక్తి ఉన్నవారినీ కలుపుకుని పోతూ లౌక్యం గా వ్యవహరించాల్సిన తరుణము. ఇది తమకు అత్యంత సామర్థ్యం ఉన్న ఎన్నికల వ్యూహం కాదని గుర్తెరిగి సంస్థ భవిష్యత్తుకు ప్రమాదమున్న ఈ వ్యవహారంలో వర్గ విచక్షణలు ప్రతీకార భావాలూ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తాయని గ్రహించి మసలుకోవాలి. ఇప్పటివరకూ మరీ ఆక్షేపించాల్సిన విషయాలు కనిపించనప్పటికీ వ్యవహారాలను మరీ గుంభనంగా చేస్తుండడం సంస్థను అల్లరి కాకుండా ఉంచడానికా లేక తమ తప్పులు ఏమైనా ఉంటే అల్లరవకుండా ఉండటానికా అనే సందేహాలు వచ్చే ప్రమాదముందని కూడా గమనించాలి. పైన వివరించిన అనేక సూచనలు అమలుపరిచే బాధ్యత వీరిదే. ఇందుకు గాను అందరితో కలసిపోగల మరియు కలిసి పనిచేసే మెరుగైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్న వాళ్ళని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో భాగస్వాములను చేస్తే మంచిదేమో ఆలోచించాలి. సంస్థను పరిపాలించడం కంటే ప్రస్తుత విషమ పరిస్థితిలో గట్టెక్కించడం ఎక్కువ ఖ్యాతి తెస్తుందని తెలుసుకోవాలి. ఉజ్వల భవిష్యత్తు కై మంచి కార్యవర్గాలను ఎన్నుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహించాలి. ఇప్పటికే తగిన కృషి చేస్తున్న బోర్డు చైర్మన్ వాసు కొడాలి మరియు లావు సోదరులు మిగిలిన వర్గాలను కూడా కలుపుకు పోవడానికి ప్రయత్నిస్తూ మరింత జాగరూకతతో వ్యవహరించాలి.
సారాంశమేమంటే, పై వివరించిన సూచనల్లో అన్నీ కాకపోయినా ముఖ్యమైన వాటిని అన్ని వర్గాలు కలిసి పాటించి కృషి చేస్తే ‘తానా’ తిరిగి తన ప్రభావాన్ని త్వరలోనే సమకూర్చుకొని మిగతా తెలుగు సంస్థ లన్నింటికీ తల్లి లాంటిది అని మళ్ళీ సగర్వంగా నిలబడగలుగుతుంది అని ఆశించవచ్చును.
ముక్తాయింపు!
నాయకులంతా కట్టు గా ఉండి ‘తానా’ ను స్థాపించెను రా
ఎందరెందరో త్యాగము చేసి ‘తానా మహలు’ నిర్మించితి రా
తగవులతో తన్నుకు చస్తే పతనము ప్రాప్తించును రా
పది కట్టెలు ఒకటిగా ఉంటే ఎవరూ విరవలేరు రా
కలిసి ఉంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఃఖం
కలిసి ఉంటే కలదు సుఖం, కలసి వచ్చును అదృష్టం
‘తానా’ తలుపులకు తాళాలు పడవని ఆశిస్తూ..
సాగర్ దొడ్డపనేని..