సాటి మనిషి అవసరాన్ని గుర్తించడం మంచితనం.. ఆ అవసరం తీర్చడం మానవత్వం.. ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్త్రుల్లో న్యూట్రీషియన్ ఫుడ్ అందక ఎందరో రోగులు, వారి బంధవులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను గుర్తించిన తానా ఫౌండేషన్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అందిస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తానా అన్నపూర్ణ పేరుతో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి, గుంటూరు, తెనాలి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత ఆహార పంపిణీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా వారి ఆకలి తీరుస్తోంది.
ఫలితంగా అందరికీ ఇంటి భోజనం తలపించేలా రుచికరమైన, నాణ్యమైన ఆహారపద్దార్థాలతో ఈ విధమైన భోజన వసతిని కల్పించడం పట్ల ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో తానా అన్నపూర్ణ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయం బుధవారం నాటికి మూడేళ్లు దిగ్విజయంగా పూర్తయినట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు అన్నపూర్ణ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సురేష్ పుట్టగుంట తెలిపారు.
ప్రధానంగా అక్షయ పాత్ర వారి సహకారంతో నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు,బాలింతలు, గర్భిణీలు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల అక్షయ పాత్ర సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తానా అన్నపూర్ణ ద్వారా పంపిణీ చేస్తున్న భోజనాలను ఇప్పటివరకు మూడు లక్షల 40వేల మంది భుజించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వీరామంగా నిర్వహించడం పట్ల తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి సురేష్ పుట్టగుంటకు అభినందనలు తెలిపారు. సామాజిక బాధ్యతగా తానా ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.