తెలంగాణలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ పేరును కూడా నిందితులు ప్రస్తావించారని ప్రచారం జరిగింది. వందల కోట్ల రూపాయలు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వారు ప్రలోభ పెట్టారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు.
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారన్న అనుమానాలున్నాయని తమిళిసై ఆరోపించారు. అంతేకాదు, ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాజ్ భవన్ పేరును ఇరికించేందుకు కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తుషార్ అనే వ్యక్తిపై కేసు పెట్టారని, రాజ్ భవన్ లో అతడు గతంలో ఏడీసీగా పనిచేశారని చెప్పారు. 2019 ఎన్నికల్లో కేరళ నుంచి తుషార్ బిజెపి తరఫున పోటీ చేసి రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు.
ప్రస్తుతం కేరళ ఎన్డీఏ ఇన్చార్జిగా పనిచేస్తున్న తుషార్ గతంలో తెలంగాణ గవర్నర్ కార్యాలయంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే తుషార్ పై ఆరోపణలు పేరుతో రాజ్ భవన్ పేరును ప్రతిష్ట మంటగలుపుతున్నారని తమిళిసై ఆరోపిస్తున్నారు. గత కొద్ది నెలలుగా తెలంగాణలో గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ నేతలు అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ అయిన తనకు ప్రోటోకాల్ ప్రకారం కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ తమిళిసై ఆరోపిస్తున్నారు. అయితే, తమిళిసై బిజెపి నేతగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ లాగా ప్రవర్తించడం లేదని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.