జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై తమిళ మీడియా సంస్థకు చెందిన ఒక పత్రిక తాజాగా ఒక కథానాన్ని అచ్చేసింది. పవన్ రాజకీయ అవగాహన ఎంతలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసేలా ఉన్న ఆ కథనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రాజకీయ పార్టీ అధినేతగా ఉండి తప్పు మీద తప్పు చేస్తున్న ఆయన తీరును సదరు పత్రిక ఘాటుగా ఏకేసింది. ఆయన తీసుకునే నిర్ణయాల్ని తప్పు పట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి.. చివరకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి.. ఆ ప్రకటన విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల్ని వెనక్కి తీసుకున్న వైనం సంచలనంగా మారటమే కాదు..పవన్ రాజకీయ పరిణితిపై పలు సందేహాలు కలిగేలా చేసింది.
ఈ తీరు తెలంగాణ.. ఏపీలోని ఆయన అభిమానులకు ఏ మాత్రం రుచించలేదు. ఆ మాత్రానికే ఎందుకు పోటీ చేస్తామని చెప్పటం.. హడావుడి చేయటమంటూ మండిపడింది. ఎన్నికల్లో పోటీపై యూటర్న్ తీసుకోవటంపై సెటైర్లు వేస్తూ ఒక కథనాన్ని అచ్చేసింది. తెలంగాణ బీజేపీ నేతల్లో కీలకమైన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ లను జనసేన అధినేత పవన్ కలుసుకున్న తర్వాత తమ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పారన్నారు.
అభ్యర్థుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పవన్ ను గందరగోళ రాజకీయ నేతగా సదరు పత్రిక అభివర్ణించింది. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలీదన్నట్లుగా ఏకేసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ.. తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన 2019లో మాత్రం అనూహ్యగా మాయవతికి చెందిన బహుజన సమాజ్ వాద్ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది. దారుణ రీతిలో ఓటమిపాలైంది.
జనసేన కేవలం ఆరు శాతం ఓట్లనుమాత్రం సొంతం చేసుకోగలిగింది. అనంతరం ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న పవన్.. మళ్లీ బీజేపీతో జట్టు కట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై.. చివర్లో మిత్రపక్షం సూచన మేరకు బరి నుంచి తప్పుకున్నారు. దీనిపై పలువురు విమర్శిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు పవన్ రాజకీయ పరిణితిని ప్రశ్నార్థకమయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.