సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ రియల్ లైఫ్ లోనూ చూశారని చెప్పాలి. వెనుకా ముందు చూసుకోకుండా.. తనకు తోచినట్లుగా చెలరేగిపోయే పోలీసు అధికారుల్ని కొంతమందిని రీల్ లైఫ్ లో చూస్తుంటాం. తాజాగా రాజంపేట డీఎస్పీ చైతన్య వ్యవహరించిన తీరు దీనికి ఏమాత్రం తగ్గదంటున్నారు. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేస్తూ వైసీపీకి అనుకూలమన్న ఆరోపణలతో బదిలీపై కడప జిల్లా రాజంపేటకు వెళ్లిన చైతన్య ఎన్నికల వేళ తాడిపత్రికి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆయన వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. ఇలా ఎలా చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. అసలేం జరిగిందన్న విషయంపై అక్కడి స్థానికులు ఏం చెబుతున్నారంటే..
బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాల్ని తీసుకొని తాడిపత్రికి వచ్చిన డీఎస్పీ వీఎన్ కే చైతన్య వీరంగం వేసినట్లుగా చెబుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ర రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంటిని ముట్టడించటమే కాదు.. ఆయన అనుచరులు.. సానుభూతిపరుల ఇళ్లపైనా విరుచుకుపడ్డారు. తెల్లవారుజాము ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున రావటం.. మాంచి నిత్రలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి వారిపై లాఠీల్ని ఝుళిపించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పలువురిని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించి తరలించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి సమీపంలో కిరణ్ అనే వ్యక్తి నివసిస్తుంటారు. అతనో దివ్యాంగుడు. అతన్ని సైతం వదిలి పట్టకుండా లాఠీలతో బలంగా కొట్టిన ఉదంతంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పని చేస్తున్న చైతన్య.. గతంలో తాడిపత్రి డీఎస్పీగా ఉన్నప్పుడు టీడీపీ నేతలు.. కార్యకర్తల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసేవారన్న పేరుంది.
ఎన్నికల పోలింగ్ అనంతరం తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వేళలో ప్రత్యేక బలగాలతో వచ్చి జేసీ ఇంటిమీదా.. చుట్టుపక్కల వారి ఇళ్ల మీదా విరుచుకుపడటాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా డీఎస్పీ చైతన్య తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజంపేటలో పని చేస్తున్న ఆయన తాడిపత్రికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? అన్న ప్రశ్నకు అధికారులు ఎవరూ సమాధానాలు చెప్పని పరిస్థితి.
అర్థరాత్రి వేళ సిబ్బందిని తీసుకొచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం.. 35 మందిని అదుపులోకి తీసుకెళ్లటం..వారిని ఎక్కడికో తరలించిన వైనం సంచలనంగా మారింది. ఇంతకూ ఆయనకు ఆ బాధ్యతను ఎవరు అప్పగించారు? రాజంపేట నుంచి తాడిపత్రికి ఎలా వచ్చారు? ఎవరు పంపించారు? అన్న ప్రశ్నలను ఆయా జిల్లాల ఎస్పీలను అడిగితే తమకు తెలీదన్న మాట చెప్పటం గమనార్హం. అంతేకాదు.. ఏడీజీకి.. డీజీపీకి కూడా తెలీదని చెబుతున్నారు. చివరకు అనంతపురం డీఐజీకి కూడా తెలీదని.. ఉన్నతాధికారులకు తెలీకుండానే తాడిపత్రికి చైతన్య వచ్చారా? వస్తే.. ఏ అధికారంతో ఆయన వచ్చినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది.