ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు జాకీర్ హుస్సేన్(73) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె, రక్తపోటు సమస్యల కారణంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాకీర్ హుస్సేన్ మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించడంతో.. జాకీర్ హుస్సేన్ మృతిపై ప్రముఖులు సంతానం తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ రియల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
1951 మార్చి 9న ముంబైలో జాకీర్ హుస్సేన్ జన్మించారు. ఆయన తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడే. ముంబై లోని మాహి అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ మైకేల్ హైస్కూల్ లో స్కూలింగ్ ను పూర్తి చేసిన హుస్సేన్.. సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
బాల మేధావి అయిన జాకీర్ హుస్సేన్.. మూడేళ్ల వయసు నుంచే తండ్రి వద్ద తబలా వాయించడం నేర్చుకున్నారు.
ఏడేళ్ల నుంచే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు ఇచ్చారు. విదేశాల్లో తన తొలి కచేరీకి జాకీర్ హుస్సేన్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. కేవలం 5 రూపాయిలు. ఆ తర్వాత ఆయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి అంచెలంచెలుగా ఎదిగారు. అంతర్జాతీయ స్థాయిలో తబలా మ్యాస్ట్రోగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. భారతదేశపు దిగ్గజ కళాకారులందరితో పాటుగా అంతర్జాతీయ కళాకారులతో కూడా కలిసి పని చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనేకసార్లు ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాకీర్ హుస్సేన్ సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారంతో, 2002 లో పద్మభూషణ్ పురస్కారంతో, 2023లో పద్మవిభూషణ్ తో ఆయన్ను సత్కరించింది. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ నుంచి హుస్సేన్ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలా అనే ఆమెను జాకీర్ హుస్సేన్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అనిసా కురేషీ, ఇసబెల్లా కురేషీ. డబ్బు కన్నా కథకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే జాకీర్ హుస్సేన్.. తన ఆరు దశాబ్దాల కెరీర్ లో కూడబెట్టిన ఆస్తులు చాలా తక్కువ. పలు నివేదికల ప్రకారం.. జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులు రూ. 10 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది.