నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ మీనాక్షి అనిపిండి రెండు దశాబ్దాల నుంచి తమ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షికోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మే 5వ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియం ఇందుకు వేదిక అయింది.
తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు ఈ ఉత్సవానికి అతిధులగా విచ్చేశారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, తెలుగు దర్శకుడు వి. ఎన్. ఆదిత్య గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు మరియు డల్లాస్ నగరంలోని ప్రముఖులు సుస్వర అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వార్షికోత్సవ సంబరాలకు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ గారికి సుస్వర సాహిత్య కళానిధి అనే బిరుదునిచ్చి అతిథులందరూ ఘనంగా సత్కరించారు. చంద్రబోస్ గారు తన స్వగ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాలయ నిర్మాణానికి ఈ కార్యక్రమం ద్వారా 15 వేల డాలర్స్ కు పైగా విరాళం ఇచ్చారు. అలాగే ఈ వార్షిక సంబరాల్లో ప్రముఖ దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. తన మాటలతో, పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఆయనకు సుస్వర నాదనిధి అనే బిరుదుతో శాస్త్రీయ సంగీత శిక్షకురాలైన మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేశారు.
ఇక ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు ముప్పైకి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయడం మెచ్చుకోదగ్గ అంశం. మరియు కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించి అందరినీ మెప్పించారు.