2018 ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఉద్యమనేతగా తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్….వరుసగా రెండోసారి కూడా గులాబీ జెండా రెపరెపలాడించారు. 2014, 2018 ఎన్నికల్లో కారు జోరుకు మిగతా పార్టీలు రేసులో నిలబడలేకపోయాయి. దీంతో, తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఇటు కాంగ్రెస్…అటు బీజేపీ గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేదని తేలింది. అయితే, 2019 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాకిచ్చింది. తెలంగాణలో అధికార పార్టీకి దీటుగా బీజేపీ నానాటికీ బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయాలకు తగ్గట్టే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 49 నుంచి 54 సీట్లు, టీఆర్ఎస్కు 14 నుంచి 16 సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన పీడీఎఫ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 19 తేదీల మధ్య 1.80 లక్షల శాంపిళ్లను ఆ సంస్థ సేకరించి సర్వే చేసిందట. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందని 19.9 శాతం మంది వెల్లడించగా… ఫర్వాలేదని 38.1 శాతం మంది, బాగోలేదని 39.8 శాతం మంది, చెప్పలేమని 2.2 శాతం మంది తమ అభిప్రాయాలు వెల్లడించారట. కేసీఆర్ పనితీరు బాగుందని 21.4 శాతం మంది, ఫర్వాలేదని 33.3 శాతం మంది, బాగోలేదని 43.4 శాతం మంది, చెప్పలేమని 2 శాతం మంది చెప్పారట. తెలంగాణలో కాంగ్రెస్కు 31.8 శాతం ఓట్లు, బీజేపీకి 37.4 శాతం వస్తే.. టీఆర్ఎస్ 13.5 శాతం ఓట్లు, ఎంఐఎంకు 14.2 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్కు 43-47 సీట్లు, బీజేపీకి 49-54, టీఆర్ఎస్కు 14-16, ఏఐఎంఐఎంకు 7-10 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. మరి, నిజంగా ఈ సర్వేలో చెప్పినట్టు టీఆర్ఎస్ పరిస్థితి ఉందా…లేదా అన్నది తేలాలంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిచూడక తప్పదు.