సంక్రాంతికి రిలీజవుతున్న తమిళ అనువాద చిత్రం ‘వారసుడు’కు.. తెలుగు సినిమాలకు దీటుగా థియేటర్లు ఇస్తుండడంపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తున్న సంగతి తెలిసిందే. పండుగలకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అనువాద చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తామని గతంలో వ్యాఖ్యానించిన దిల్ రాజు.. తన సినిమా అయిన ‘వారసుడు’ విషయానికి వచ్చేసరికి భిన్నంగా వ్యవహరిస్తుండడంపై చాలామంది విమర్శలు చేశారు. దీనికి ఆయన ఇవ్వాల్సిన వివరణ ఏదో ఇచ్చారు.
కాగా దిల్ రాజుకు మద్దతుగా ఇంతకుముందు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ మాట్లాడగా.. ఇప్పుడు సురేష్ బాబు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి చిత్రాలు తమిళంలో రిలీజైతే వాటికి సరిపడా థియేటర్లు ఇచ్చారని, అవి అక్కడ బాగా ఆడాయని.. కాబట్టి తమిళ అనువాదాలకు మనం థియేటర్లు ఇవ్వాల్సిందేనని.. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే అని ఆయన అన్నారు.
ఐతే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి చిత్రాలను ఉదాహరణగా చూపించి తమిళ ఇండస్ట్రీ ఉదారంగా వ్యవహరించినట్లు సురేష్ బాబు మాట్లాడుతున్నారు కానీ.. ఇలా తమిళులు సపోర్ట్ చేసిన సినిమాలను వేళ్ల మీదే లెక్కబెట్టగలం. అది కూడా అనివార్య పరిస్థితుల్లో జరిగిందన్నది వాస్తవం.
ఈ మూడు చిత్రాలకూ తమిళంలో కూడా మంచి క్రేజ్ వచ్చింది, ప్రేక్షకుల డిమాండ్‌ను అనుసరించి థియేటర్లు వాటిని ప్రదర్శించాయి. పైగా అవేవీ కూడా సంక్రాంతి, దీపావళి, దీపావళి లాంటి విపరీతమైన పోటీ ఉండే సమయంలో రిలీజ్ కాలేదు. ఇలాంటి సీజన్లలో పోటీ ఉండగా తమిళ చిత్రాలకు సమానంగా, అవి కూడా డిమాండ్ లేని మన చిత్రాలకు థియేటర్లు ఇచ్చి ఉంటే అప్పుడు వాళ్లు ఉదారత్వం గురించి మాట్లాడాలి.
దసరాకు రిలీజైన చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ను నేరుగా తమిళంలో రిలీజ్ చేద్దామంటే ‘పొన్నియన్ సెల్వన్’కు థియేటర్లు తగ్గించే ఛాన్సే లేదని తేల్చేయడంతో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రాబోయ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాలు మంచి అంచనాల మధ్య రిలీజవుతుంటే.. తెలుగులో అంతగా డిమాండ్ లేని ‘వారసుడు’కు వాటికి దీటుగా థియేటర్లు ఇస్తుండడమే అభ్యంతరాలకు కారణం.
ఇదే సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తామంటే తమిలనాట వారసుడు, తునివు చిత్రాలతో సమానంగా థియేటర్లు ఇచ్చేంత పెద్ద మనసు అక్కడి వారికి ఉందా అన్నది ప్రశ్న?