ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్ గురి చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ వ్యవహారంపై రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ముఖ్యంగా ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ మాజీ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిపై రఘురామ తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు వైద్య నివేదిక ఇచ్చారని ఆమెపై కేసు నమోదైంది.
అయితే, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పద్మావతి హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆమెకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలోనే ఆమె హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అయతే, విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతిని ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా, ఆ కసు దర్యాప్తు దశలో కేసు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. కస్టోడియల్ టార్చర్ తర్వాత జీజీహెచ్ లో సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలిచ్చారు. కానీ, డాక్టర్ ప్రభావతి ఆ నివేదికలు మార్చేశారని ఆరోపణలు వచ్చాయి. రఘురామకు ఎటువంటి గాయాలు కాలేదని ప్రభావతి నివేదికలిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, ప్రభావతిపై గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.