గత వారంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగానే కాదు.. వివాదాస్పదంగా మారటం తెలిసిందే. అదే సమయంలో ఫోక్సో చట్టంలోని లోపాన్ని ఎత్తి చూపింది. ఒక బాలికను దుస్తులపై నుంచి శరీర భాగాల్ని తాకటం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పును ఇచ్చి.. కింద కోర్టు దోషిగా తేల్చి మూడేళ్ల జైలుశిక్షను ఏడాదికి తగ్గిస్తూ తీర్పును ఇచ్చింది. అసభ్యంగా తాకటం లైంగిక వేధింపుల కిందకు రాకపోవటం ఏమిటన్న విస్మయాన్ని పలువురు వ్యక్తం చేశారు.
2016లో సతీశ్ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లటం.. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పే ప్రయత్నం చేయగా.. భయంతో ఆ బాలిక పెద్దగా అరించింది. దీంతో.. ఆమె తల్లి అక్కడకు రావటం.. ఆ ఆరాచకంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మూడేళ్లు జైలుశిక్షను విధించారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు.. బాలిక దుస్తుల పై తాకటం నేరం కాదని.. పోక్సో చట్టం ఏం చెప్పిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. జైలుశిక్షను తగ్గిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు బాలిక దుస్తులు తొలగించాడా? దుస్తుల లోపలికి చేయి పెట్టాడా? అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు కనుక దీన్ని లైంగిక వేధింపుల కింద భావించలేమంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ తీర్పును మహిళా సంఘాలు..సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించాయి.
తాజాగా ఈ తీర్పును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లారు. బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆందోళను కలిగిస్తుందని..భవిష్యత్తులో ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా మారుస్తుందన్నారు. ఈ తీర్పుపై స్పందించిన సుప్రీంకోర్టు..వెంటనే స్టే ఇస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. అంతేకాదు.. నిందితుడికి నోటీసులు జారీ చేసింది. బాంబే హైకోర్టు జారీ చేసిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలంటే ఏజీని ఆదేశించింది. ఇదో మంచి పరిణామంగా పలువురు అభివర్ణిస్తున్నారు.