మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. దానికితోడు ఈ కేసులో సాక్షులను నిందితులు, అనుమానితులు బెదిరిస్తున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ ప్రకారం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పేనని, సాక్షుల ప్రాణాలను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందేనని వాదనలు కోర్టులో జరిగాయి. మరోవైపు, ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి పొరుగు రాష్ట్రం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంగిరెడ్డి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కూడా అక్కడికే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.
నిందితుడి బెయిల్ రద్దు అంశంపై నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టుకు వదిలేస్తున్నట్లు పేర్కొంది. వివేకా హత్య కేసుతో పాటే నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్ ను విచారించాలని ఆదేశించింది. కేసులోని మెరిట్స్ ను పరిశీలించి, నిందితుడి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు, ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి.